మహేష్ బాబు తల్లి, తండ్రి ఇద్దరూ నెలన్నర గ్యాప్ లో మహేష్ ని వదిలి వెళ్లిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో ఈ నెల 15 న నిర్యాణం చెందగా.. నిన్న బుధవారం మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు అశ్రునయనాల మధ్యన ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగాయి. సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ లెజెండ్ గా, మంచి మనిషిగా తనువు చాలించారు. అలాగే కృష్ణకి అనేక ఆస్తులున్నాయి. ఇటు మహేష్ బాబు బోలెడంత సంపాదిస్తున్నారు. డబ్బుకు కొదవలేదు. అంతటి మహానుభావుడి అంత్యక్రియలను కూడా ఓ వర్గం మీడియా కాంట్రవర్సీ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. అంటే కృష్ణగారి భౌతిక కాయానికి మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరపకుండా.. కృష్ణగారు కొన్న పొలాల్లోనో, లేదంటే మహేష్ బాబు స్థలాల్లోనో, లేదంటే పద్మాలయ స్టూడియోలోనే అంత్యక్రియలు నిర్వహిస్తే బావుండేది, అక్కడే ఓ ఎకరంలో సమాధి కడితే బావుండేది అని విమర్శిస్తున్నారు. అర్ధం పర్ధం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ విషయమై ఏకంగా మహేష్ నిర్ణయాన్నే తప్పుబడుతున్న విశ్లేషకుల విపరీత ధోరణి ఎలా ఉందంటే.. ఆదిశేషగిరి రావు, రమేష్ భార్య లాంటి వాళ్ళు చెప్పినా వినకుండా మహేష్ బాబు ఈ కార్యక్రమాన్ని మహా ప్రస్థానంలో నిర్వహించడం కరెక్ట్ కాదు అంటున్నారు. కానీ మహేష్ చేసింది ముమ్మాటికీ తప్పుకాదు, అంత బాధలో వున్నా ఆయన చేసింది కరెక్ట్ అనే అందరూ అంటున్నారు. ఎందుకంటే మనిషి తనువు చాలించినప్పుడు స్వర్గలోక ప్రాప్తి పొందాలని అనుకుంటారు. అలాంటి భావనతోనే ప్రతి ఊరికి కేటాయించిన స్మశానంలోనే అంత్యక్రియలు జరుపుతారు. అలా అయితే వాళ్ళు స్వర్గలోక ప్రాప్తి పొందుతారని.! ఎవ్వరికి ఎన్ని ఆస్తులైనా ఉండొచ్చు, అందులోనే అంత్యక్రియలు జరిపించాలని లేదు, గోత్రాల ప్రకారం కొంతమందికి కుటుంబ సంప్రదాయం ఉంటుంది.. సాంప్రదాయాల ప్రకారం అందరితో మనం అనేలా మహా ప్రస్థానంలో చేసే ధనవంతులు చాలామందే ఉన్నారు.
ఇక్కడ ఎన్టీఆర్ కి ప్రభుత్వ స్థలం ఇచ్చినా, ఏఎన్నార్ కి అన్నపూర్ణ స్టూడియోస్ లో అంత్యక్రియలు జరిగినా అది ఆ కుటుంబ సాంప్రదాయాల ప్రకారం వారి ఇష్ట పూర్వకంగా జరిగింది. మహేష్ తమ కుటుంబ పద్ధతులకు విలువనిచ్చే తన తల్లి ఇందిరాదేవి గారికి కూడా మహాప్రస్థానంలోనే అంత్యక్రియలు జరిపించాడు. అలాగే తండ్రి అంత్యక్రియలు అతని ఫ్యామిలీ పెద్దలతో మాట్లాడే నిర్ణయం తీసుకున్నాడని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. కానీ మహేష్ చేసింది కరెక్ట్ కాదు, ఆయన చేసింది తప్పు అంటూ మాట్లాడితే.. కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చెయ్యడం తప్ప ఇంకేం ఉండదు. బాధలో ఉన్న ఫ్యామిలీకి చెయ్యి అందించాలి కానీ, విమర్శలు చేస్తూ బాధపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ సో కాల్డ్ క్రిటిక్స్ స్వీయ విమర్శ చేసుకోవాలి.!