సూపర్ స్టార్ కృష్ణ ఈ నెల 15 న మంగళవారం అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్ లోని ప్రవేట్ హాస్పిటల్ లో మృతి చెందారు. కృష్ణ గారి మరణంతో ఘట్టమనేని ఫ్యామిలీ శోకసముద్రంలో మునిగిపోయింది. ఘట్టమనేని కుటుంబం ఎంతగా విలవిల్లాడిందో.. కృష్ణ గారి అభిమానుల గుండె అంతే పగిలిపోయింది. కృష్ణగారి అభిమానులు ఆయన లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేక.. ఆయన కడసారి చూపుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుండి హైదరాబాద్ కి పయనమయ్యారు. నిన్న మంగళవారం నుండి నేటి మధ్యాన్నం ఆయన అంతిమ యాత్ర వరకు ఆయన్ని చూసేందుకు అభిమానులు క్యూ కట్టారు.
పద్మాలయ స్టూడియోస్ లో అభిమానులు, ప్రముఖుల సందర్శనార్ధం.. కృష్ణ గారి అంతిమ యాత్ర మొదలయ్యింది. పద్మాలయ స్టూడియోస్ నుండి.. మహా ప్రస్థానం వరకు వేలాదిమంది అభిమానుల మధ్యన సాగిన అంతిమ యాత్ర తర్వాత మహా ప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో.. పోలీస్ లు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపిన తర్వాత, మహేష్ బాబు పుట్టెడు దుఃఖంతోతండ్రి కృష్ణ గారికి తలకొరివి పెట్టి అంతిమ సంస్కరాలు పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే.. ఘట్టమనేని కుటుంబం అభ్యర్ధన మేరకు కృష్ణ గారి అంతిమ సంస్కారాల సమయంలో ఛానల్స్ లైవ్ ఆపేసారు.
ఈ అంతిమ సంస్కారాలకు కృష్ణ కుటుంబంతో పాటుగా, మంత్రి తలసాని, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మెహర్ రమేష్ అలాగే రాజకీయ, సినీ ప్రముఖులు హరయ్యారు. కొద్దిసేపటి క్రితమే అశ్రునయనాల నడుమ కృష్ణ గారి అంతిమ సంస్కారాలు ఫిలిం నగర్ మహా ప్రస్థానంలో పూర్తయినట్లుగా సమాచారం.