సూపర్ స్టార్ కృష్ణ ఎలాంటి వారంటే.. ఎవరైనా ఏదైనా చేయాలి అనుకునే లోపు ఆయన చేసి చూపించేవారు. సినిమా పరంగా కూడా ఎవరైనా ఆ సినిమా చేయాలని అనుకునే లోపు.. కృష్ణ ఆ సినిమా చేసి చూపించేవారు. అలాంటి కోవకి చెందిన చిత్రమే ‘అల్లూరి సీతారామరాజు’. అందుకే కృష్ణని అందరూ మొండిఘటం అని అంటుంటారు. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాని నటరత్న నందమూరి తారక రామారావు చేయాలని ఎంతగానో ప్రయత్నించారు. స్ర్కిప్ట్ కూడా సిద్ధం చేశారు. కానీ ఆయన ఆలోచనలో ఉండగానే కృష్ణ.. ఆ సినిమాని తెరపైకి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా ఈ సినిమా విషయంలో హ్యాపీగా ఫీలయ్యారు. తన దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా కృష్ణకి ఇచ్చారని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి కృష్ణ.. ఎంతో ముచ్చటపడి చేయాలనుకున్న ఓ సినిమా మాత్రం చేయలేకపోయారు.
సూపర్ స్టార్‌కు ‘ఛత్రపతి శివాజీ’ అంటే చాలా ఇష్టం. ‘ఛత్రపతి శివాజీ’పై సినిమా చేయాలని ఎంతగానో ప్రయత్నించారు. ‘కురుక్షేత్రం’ విడుదలై, ఘన విజయం సాధించిన సమయంలోనే ‘ఛత్రపతి శివాజీ’ ప్రాజెక్టుపై ఆయనకు మనసు మళ్లింది. ఛత్రపతి కథని ఎలాగైనా సినిమాగా తీయాలని భావించిన కృష్ణ.. అందుకోసం మహారథిని స్ర్కిప్టు సిద్ధం చేయమని ఆదేశించారు. మహారథి కూడా ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ చిత్రానికి తను కానీ, లేదంటే విజయ నిర్మల కానీ దర్శకత్వం చేయాలనేలా కూడా అనుకున్నారు. కానీ ఆ కథతో సినిమాని కృష్ణ చేయలేకపోయారు. అందుకు ప్రధాన కారణం.. ఆ సినిమా చేస్తే మత ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని కృష్ణ భావించారట. తన వల్ల, తన సినిమా వల్ల.. అశాంతి చెలరేగకూడదన్నది కృష్ణ ఉద్దేశ్యం. అందుకే ఇష్టపడి సిద్ధం చేసుకొన్న కథని పక్కన పెట్టేశారు. ఒక సినిమా విషయంలో కమర్షియల్‌గా ఆలోచించే రోజులలోనే.. కృష్ణ ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారంటే.. ఇది ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం.