శ్రీలంక బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్ మనీలాండరింగ్ కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. జాక్వలిన్ ఫ్రెండ్ సుఖేష్ చంద్ర 200 కోట్ల చీటింగ్ కేసులో జాక్వలిన్ పై ఆరోపణలు చేస్తూ ఈడీ ఆమెకి నోటీసు లు పంపడం, అలాగే సుఖేష్ చంద్ర నుండి జాక్వలిన్ కోట్లానుకోట్ల బహుమతులు అందుకుంది, జాక్వలిన్ సుఖేష్ ఇచ్చిన డబ్బుని సరదాల కోసం నీళ్లలా ఖర్చు పెట్టింది, విలాసవంతమైన హోటల్స్ లో బస చెయ్యడం దగ్గరనుండి ఖరీదైన హ్యాండ్ బాగ్స్, జిమ్ దుస్తులు, లూయిస్ విటోన్ బూట్లు, అలాగే శ్రీలంకలో ఖరీదైన బంగ్లాలు గిఫ్ట్ లుగా అందుకుంది అంటూ ఈడీ జాక్వలిన్ ని దోషిని చేసి విచారణ చేసింది. జాక్వలిన్ కూడా ఈ కేసులో పలుమార్లు ఈడీ విచారణకు హాజరయ్యింది.
అయితే ఈడీ జాక్వలిన్ ని అరెస్ట్ చెయ్యాలంటూ కోర్టు కెక్కింది. ఆమెని ఈ కేసులో అరెస్ట్ చెయ్యాలంటూ ఈడీ కోర్టు ని కోరింది. జాక్వెలిన్ వద్ద కావాల్సినంత డబ్బు ఉందని, దానితో విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని, కేవలం సరదా కోసమే జాక్వెలిన్ 7.14 కోట్లు ఖర్చు చేసిందంటూ ఈడీ కోర్టులో వాదించినప్పటికీ.. ఈడీకి షాకిస్తూ జాక్వలిన్ కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమెపై ఈడీ దర్యాప్తు ఇప్పటికే ముగియడం, చార్జిషీటు కూడా దాఖలు చేయడం, అలాగే ఆమెను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ కోర్టు జాక్వలిన్ కి బెయిల్ మంజూరు చేసింది. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. అయితే కోర్టు జాక్వెలిన్ కు షరతు విధించింది. కోర్టు అనుమతి లేకుండా దేశాన్ని విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది.