మహేష్ బాబు కి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. ఈ ఏడాది తన అన్న రమేష్ బాబు మరణం ఆయన్ని కుదిపేసింది. చివరి చూపుకు కూడా నోచుకోలేని మహేష్ చాలా మధనపడిపోయాడు. కరోనా కారణంగా అన్న రమేష్ బాబు అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయాడు మహేష్. తర్వాత తల్లి ఇందిరా దేవి మరణంతో మహేష్ మరింతగా కుంగిపోయాడు. కొద్దిరోజుల క్రితం తనకి ఇష్టమైన వాళ్లంతా వెళ్ళిపోతున్నారంటూ స్టేజ్ పై మహేష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మ చనిపోయి రెండు నెలలు తిరక్కుండానే మహేష్ కి తన దేవుడు అని భావించే తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు దూరమయ్యారు.
తండ్రితో మహేష్ అనుబంధం విడదీయలేనిది, తనకి ఆయన దేవుడితో సమానమని మహేష్ చెబుతూ ఉంటాడు. అలాంటి తండ్రి మరణాన్ని మహేష్ తట్టుకోలేకపోతున్నాడు. ఈ రోజు మంగళవారం తుది శ్వాస విడిచిన కృష్ణ గారికి నివాళులు అర్పించేందుకు వస్తున్న ప్రముఖుల ముందు మహేష్ అలా నిస్సారంగా నించుని బాధపడడం అందరి మనసులని కలిచివేస్తుంది. తాను మావయ్యలా భావించే రాఘవేంద్ర రావు గారు కృష్ణగారికి నివాళు అర్పించేందుకు రాగానే మహేష్ ఆయన్ని పట్టుకుని ఏడ్చేసిన విజువల్స్ మీడియాలో హైలెట్ అయ్యాయి. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని ఉన్న మహేష్ ని ఓదార్చడం ఎవరి తరమవుతుంది.
మెగాస్టార్ చిరు, వెంకటేష్ లు మహేష్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా మహేష్ కళ్ళ నీళ్లు తుడుచుకోవడం చూసిన ఆయన అభిమానులు కన్నీటి పర్యంతమవుతూ.. స్టే స్ట్రాంగ్ మహేష్ అన్నా అని ఆయనకి ధైర్యాన్ని చెబుతున్నారు.