సాహసానికి మారుపేరైన సూపర్ స్టార్ కృష్ణ.. మంగళవారం ఉదయం 4 గంటల 09 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం తెలుగు సినిమా పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటుగా భావిస్తూ.. సినీ రాజకీయ ప్రముఖులెందరో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు సూపర్ స్టార్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.
‘‘విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు ప్రజలకు సామాజిక స్పృహ కలిగించే సాంఘిక చిత్రాల నటుడిగా కృష్ణ జనాదరణ పొందారు. నాటి కార్మిక, కర్షక లోకం ఆయన్ను తమ అభిమాన హీరోగా, సూపర్ స్టార్‌గా కీర్తించే వారు. సొంత నిర్మాణ సంస్థ స్థాపించి సినిమా రంగంలో నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టిన ఘనత కృష్ణదే. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’- తెలంగాణ సీఎం కేసీఆర్
‘‘కృష్ణగారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి... ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఏపీ మాజీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా సూపర్‌స్టార్‌కు నివాళులు అర్పించారు. ‘‘తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, నటశేఖరుడిగా, సూపర్‌స్టార్ గా పిలిపించుకున్న నటులు, మాజీ ఎంపీ కృష్ణ గారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. నటుడిగా, దర్శకుడిగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహసనిర్మాతగా కృష్ణగారిని చెప్పుకుంటారు. కృష్ణగారి మరణంతో ఒక అద్భుత సినీశకం ముగిసినట్లయింది. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయిన మహేష్ బాబుకు ఇది తీరని వేదన. ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని ఆయనకు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’: చంద్రబాబు
వీరే కాకుండా పలు పార్టీలకు చెందిన నాయకులెందరో సూపర్ స్టార్ కృష్ణకు నివాళులు అర్పిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.