ఒకప్పుడు నిర్మాత దిల్ రాజు మాట్లాడిన మాటలే.. ఇప్పుడాయనని అడ్డంగా ఇరికించాయి. స్ట్రయిట్ సినిమాలు, డబ్బింగ్ సినిమాల విషయంలో ఒకప్పుడు దిల్ రాజు మాట్లాడుతూ.. స్ట్రయిట్ సినిమాలు ఉండగా, డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఎలా ఇస్తాం? అనేలా వ్యాఖ్యలు చేశారు. స్ట్రయిట్ సినిమాలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతే.. థియేటర్లను డబ్బింగ్ సినిమాలకు కేటాయించాలని దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడాయన ‘వారసుడు’ సినిమాని ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నాయి. దిల్ రాజు అప్పట్లో చెప్పిన మాటలని ఇప్పుడు కూడా అప్లయ్ చేయాలంటూ.. స్వయంగా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి రంగంలోకి దిగడం విశేషమనే చెప్పుకోవాలి.
గత కొన్ని రోజులుగా దిల్ రాజు తన సినిమా ‘వారసుడు’ కోసం థియేటర్లను బ్లాక్ చేస్తున్నాడనేలా టాక్ వినిపిస్తోంది. చిరు, బాలయ్య అభిమానులు కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో హైలెట్ చేస్తూ.. ఆయా చిత్రాల మేకర్స్‌ని మేల్కొలిపే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ‘వారసుడు’ సినిమాని డైరెక్ట్ చేస్తుంది వంశీ పైడిపల్లి అయినప్పటికీ అది డబ్బింగ్ చిత్రంగానే తెలుగులో విడుదల కాబోతోంది. అలాంటప్పుడు.. ఆ సినిమాకు ఎక్కువ థియేటర్లు కేటాయించి.. చిరు, బాలయ్య చిత్రాలకు తక్కువ థియేటర్లు అంటే ఫ్యాన్స్ గొడవలకు దిగడం పక్కా. అసలీ విషయంలో ఫ్యాన్స్ ఉన్నంత అలెర్ట్‌గా మేకర్స్ కూడా లేరు. ఫ్యాన్స్ అలెర్ట్‌కే తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి.. ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ.. అప్పట్లో దిల్ రాజు చెప్పినట్లుగా సంక్రాంతి, దసరా పండుగలకు స్ట్రయిట్ చిత్రాలకు ఎక్కువ థియేటర్లు ఇవ్వాలని ఎగ్జిబిటర్స్‌కు సూచన చేసింది. మరి ఈ ప్రకటనపై దిల్ రాజు ఎలా రియాక్ట్ అవుతాడనేదే ఇప్పుడసక్తికర విషయం.