తెలుగులో ‘ఆహా’ ఓటీటీలో.. నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా విజయవంతంగా రన్ అవుతోన్న షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’. ఫస్ట్ సీజన్ సక్సెస్‌ఫుల్‌గా ముగించుకుని.. రెండో సీజన్‌లోకి అడుగుపెట్టిన ఈ టాక్ షోకు ఆదరణ రెట్టింపు అయ్యింది. ఈ సీజన్‌కు పాలిటిక్స్‌ను కూడా జోడించడంతో.. సినీ, రాజకీయ వర్గాల్లో ఈ షో గురించి మాట్లాడుకునేలా చేశారు ‘ఆహా’ బృందం. అందుకు కారణం కూడా బాలయ్యే కావడం విశేషం. ఎందుకంటే.. బాలయ్యకు సినిమా, పాలిటిక్స్ రెండు కళ్లు. రెండింటిపైనా సక్సెస్‌ఫుల్‌గా స్వారీ చేస్తున్న బాలయ్యతో సినిమా వాళ్లనే కాకుండా.. రాజకీయ నాయకులని కూడా ఆటపట్టించే ప్రక్రియ ‘ఆహా’లో జరుగుతుంది. అందుకు ఈ సీజన్ 2లో తొలి ఎపిసోడే ఉదాహరణ.
అయితే బాలయ్య బిజీ కారణంగా.. ఈ షో అనుకున్నంతగా అంటే.. వారానికో ఎపిసోడ్ మాత్రం పడటం లేదు. అంతా సక్రమంగా నడిచిస్తే.. ఇప్పుడీ షో లో 6వ ఎపిసోడ్‌కి సంబంధించి హడావుడి మొదలయ్యేది. కానీ ఇంకా నాలుగవ ఎపిసోడ్‌కి సంబంధించే ఎలాంటి వివరణ రాలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ నాల్గవ ఎపిసోడ్‌కి మళ్లీ పొలిటికల్ టచ్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. లాంఛ్ ఎపిసోడ్‌కి పొలిటికల్ టచ్ ఇచ్చిన ‘ఆహా’ బృందం.. ఆ తర్వాత రెండు ఎపిసోడ్స్‌ని సినిమా సెలబ్రిటీలతో లాగించేశారు. ఇప్పుడు నాల్గవ ఎపిసోడ్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, అప్పటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ రాబోతున్నట్లుగా ‘ఆహా’ వర్గాల్లో టాక్ నడుస్తోంది.