ప్రపంచంలో టెక్నాలజీ ఎంత పెరుగుతుందో.. అంత వినాశనం కూడా జరుగుతుంది. ఇది కాదనలేని సత్యం. మానవుడి మేధస్సుతో పాటు.. అంతే స్థాయిలో అత్యాశ కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఒక్కరోజులో ప్రపంచాన్ని శాసించాలనుకోవడం, కుబేరుడై పోవాలని అడ్డదారులు అన్వేషించడం కారణంగానే.. కొన్ని కంపెనీలు, కొందరు వ్యక్తుల చేతుల్లో ప్రపంచం కీలుబొమ్మగా మారిపోయింది. అందుకే ఈ కుంభకోణాలు, అరాచకాలు. అలాంటి వాటి గురించి చర్చించిన వారు తెల్లారి పేపర్లలో శవాలై కనబడుతుంటారు. ఇది సినిమాల్లో చూపించేదే కాదు.. నిత్యం ఏదో ఒక చోట జరుగుతున్నదే. అలా జరుగుతుంది కాబట్టే.. సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పుడలాంటి ఓ గ్లోబల్ ప్రాబ్లమ్‌తో వచ్చిన సినిమానే ‘సర్ధార్’.
ఈ తరహా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో.. కార్తీ, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నవంబర్ 18 నుండి తెలుగు, తమిళ భాషల్లో ‘ఆహా’ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ కనుక ప్రజలలోకి పర్ఫెక్ట్‌గా వెళ్లి ఉంటే మాత్రం.. ప్రజలు భయపడిపోయేవారు. కరోనా వైరస్ కంటే కూడా ప్రాణాంతకమైన సమస్యను ఇందులో దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపించాడు. కానీ ఎందుకో.. ఇలాంటి సినిమాలను చూసినంత సేపు తప్ప.. పక్కకు రాగానే ప్రజలు కూడా పట్టించుకోరు. అంతగా ఆ అవసరాన్ని ప్రజల జీవితాలలోకి స్వార్థపరులు ఎక్కించేశారు. అయితేనేం.. ఈ సినిమా చూసి ఒక్కడు మారినా.. ఆ దర్శకుడి ప్రయత్నం ఫలించినట్లే. సరే.. ఆ విషయం పక్కన పెడితే.. థియేటర్లలో మంచి సక్సెస్ సాధించిన ఈ చిత్రాన్ని ఓటీటీలో ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు? అసలీ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారనేది? తెలియాలంటే నవంబర్ 18 వరకు వెయిట్ చేయక తప్పదు.