జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని తిడితే చాలు.. జగన్ ప్రభుత్వంలో పదవి గ్యారంటీ అన్నట్లుగా ఏపీ ప్రభుత్వ తీరు మారిపోయింది. పవన్ కల్యాణ్‌ని తిట్టిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి వరిస్తే.. కార్యకర్తలకు ఇతర పదవులు అన్నట్లుగా ఏపీ సీఎం జగన్ వ్యవహార తీరు ఉంది. రీసెంట్‌గా నటుడు, కమెడియన్ అలీని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారునిగా నియమించిన జగన్.. పవన్ కళ్యాణ్‌పై ఆ మధ్య శివాలెత్తిపోయిన పోసానికి ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టాడు.
ఏపీ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFDC) ఛైర్మన్‌గా పోసానిని నియమిస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు ఈ పదవిలో నటుడు విజయ్ చందర్ ఉండగా.. ఇప్పుడా పదవిని పోసానికి అప్పజెప్పారు. అంతా బాగానే ఉంది కానీ.. పోసానికి ఈ పదవి ఇవ్వడమే.. ఇప్పుడు అనేక చర్చలకు తావిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ని, ఆయన ఫ్యామిలీని ఈ మధ్య పోసాని ప్రెస్ మీట్ పెట్టి మరీ తిట్టాడు. ఆ తర్వాత కొంతకాలం కనిపించకుండా పోయాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు పదవి. ఇంకా ఏపీ ప్రభుత్వంలో పదవుల కోసం వేచి చూస్తున్న వైసీపీ కార్యకర్తలకు.. పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తే సరిపోతుందనే భావనను జగన్ ప్రభుత్వం సూచిస్తుందనేది ఈ విషయంతో మరోసారి రుజువయినట్లుగా అంతా అనుకుంటున్నారు.