టాలీవుడ్ లో ప్రభాస్ సోదరుడు, స్నేహితులు కలిసి ఏర్పాటు చేసిన యువి క్రియేషన్స్ అంటే ఆల్మోస్ట్ ప్రభాస్ దే అన్న రేంజ్ లో ప్రొజెక్ట్ అయ్యింది. ఎందుకంటే ప్రభాస్ అన్న ప్రమోద్, ప్రభాస్ ఫ్రెండ్ వంశి కలిసి ఈ నిర్మాణ సంస్థని నడుపుతున్నారు. ఈ నిర్మాణ సంస్థలో ఒకప్పుడు మీడియం బడ్జెట్ మూవీస్ తెరకెక్కేవి. కానీ సాహో తో పాన్ ఇండియా మూవీ ని నిర్మించిన ఈ నిర్మాణ సంస్థ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ లోని యువి క్రియేషన్స్ ఆఫీస్ పై ఐటి దాడులు జరగడం కలకలం సృష్టించింది.
యూవీ క్రియేషన్స్ సంస్థ పన్ను ఎగవేసినట్టు ఆరోపణలు రావడం, అదే నిజమని అనుమానిస్తున్న జీఎస్టీ అధికారులు.. సంస్థ కార్యాలయంలో మంగళవారం ఉదయం నుండే తనిఖీలు జరిపినట్టు సమాచారం. పన్ను ఏమైనా ఎగవేశారా.. లేదా అనే విషయంపై అధికారులు తనిఖీలు చేసి ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై జీఎస్టీ అధికారులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోపక్క యువి క్రియేషన్స్ వారు ప్రభాస్ ఆదిపురుష్ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న టైమ్ లో ఈ సంస్థపై ఐటి దాడులు జరగడం హాట్ టాపిక్ గా మారింది.