నాగ చైతన్య ని ప్రేమించి అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని నాలుగేళ్లు కలిసి కాపురం చేసిన సమంత కొన్ని కారణాలతో చైతూ నుండి విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత కూడా నాగార్జున సమంత ని తప్పుబట్టలేదు. అలాగని నాగ చైతన్య సమంతని ఎలాంటి కామెంట్ చెయ్యలేదు. కానీ సమంత తన బాధని, అసహనాన్ని సోషల్ మీడియా ద్వారా చూపించింది. తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. అయితే తాజాగా సమంత తనకి మయోసిటిస్(కండరాలు పట్టెయ్యడం, విపరీతమైన నీరసం) అనే వ్యాధితో చికిత్స తీసుకుంటున్నాను అని, తనకి త్వరలోనే తగ్గుతుంది అని డాక్టర్స్ చెబుతున్నారంటూ చేసిన పోస్ట్ చూసి అందరూ షాకైపోయారు.
అయితే సమంత మయోసిటిస్ వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని ఆమె తో పని చేసిన హీరోలు, ప్రముఖులు ట్వీట్స్ చేస్తూ.. ఎప్పటిలాగా మాములుగా అవ్వాలంటూ ఆకాంక్షిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుండి చిరు వరకు, అక్కినేని అఖిల్ కూడా ఆమె కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. మరి కొన్నాళ్ళు కాపురం చేసిన మాజీ భార్య త్వరగా కోలుకోవాలని నాగ చైతన్య ఓ ట్వీట్ వేసుకుంటే అభిమానులు సంతోషించేవారు. అలాగే మాజీ కోడలు అని కాకపోయినా.. తన సినిమాల్లో నటించిన సమంత త్వరగా కోలుకుని మాములు మనిషి అవ్వాలని నాగార్జున కూడా ట్వీట్ చేసి ఉంటే బావుండేది అంటూ నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.