ఎట్టకేలకు వైఎస్ఆర్‌సీపీలో కమెడియన్, నటుడు అలీకి ఓ పదవి లభించింది. దీనిని పదవి అనే కంటే.. ఒక స్థానం లభించింది అంటే బాగుంటుందేమో. దాదాపు రెండు సంవత్సరాలుగా వైసీపీ విషయంలో అలీపై ఎటువంటి వార్తలు వినిపిస్తున్నాయో తెలియని విషయం కాదు. ఒకసారి రాజ్యసభకు అన్నారు.. ఇంకోసారి వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ పదవి అన్నారు.. మరోసారి ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారని అన్నారు. దాదాపు ఈ పదవులు అలీ చేతి వరకు వచ్చి చేజారిపోయాయి. దీంతో అలీ కూడా పార్టీపై నిరాశగా ఉన్నట్లుగా ఈ మధ్య వార్తలు వచ్చాయి. పార్టీ మారుతున్నాడనేలా కూడా వార్తలు వైరల్ అయ్యాయి. మరి నిజంగానే అలీ పార్టీ మారతాడని భావించాడో.. లేదంటే అలీ అవసరం ఉందని గుర్తించాడో తెలియదు కానీ.. ఎట్టకేలకు ఓ పదవిని అలీకి ఇస్తున్నట్లుగా తాజాగా వైఎస్ జగన్ ఓ జీవోని విడుదల చేశారు.
ఇంతకీ అలీకి ఏ పదవి ఇచ్చారని అనుకుంటున్నారా? జర్నలిస్ట్ పదవి.. షాక్ అవుతున్నారా? నిజమే ఆయనకిచ్చిన పదవి ఏంటో తెలిస్తే అందరూ ఇదే అనుకుంటారు. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీని నియమించారు. ఈ పదవిలో అలీ రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అయితే ఆయనకి ఇచ్చే జీతభత్యాల వివరాలు మాత్రం ఇందులో తెలపలేదు. వాటి వివరాలను తర్వాత తెలియజేస్తామని ప్రకటించారు. అలీకి ఈ పదవి ఇచ్చారని తెలిసినప్పటి నుంచి.. అలీని ఓ జర్నలిస్ట్‌గా వైసీపీ ప్రభుత్వం భావించిందంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.