పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షునిగా విజయవాడ లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని చెడుగుడు ఆడిన తర్వాత, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం అమాంతం మారిపోయింది. పవన్ కళ్యాణ్ తరతమ బేధాలు లేకుండా అటు రాష్ట్రంలోని జగన్ మోహన్ రెడ్డి ని, ఇటు కేంద్రంలోని మోడీ మీద నిప్పులు చేరగడంతో పవన్ కళ్యాణ్ తదుపరి అడుగు పై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి పై ధ్వజమెత్తిన తర్వాత, కేంద్రంలోని మోడీ సర్కార్ పై ఘాటు వ్యాఖలు చేస్తూ బిజెపి రోడ్ మాప్ కోసం వేచిచూసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. అదే సమయంలో టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు తో కలిసి కార్యాచరణపై చర్చించడంతో, అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది.
ఇప్పుడు అంతా, ఇక పవన్ కళ్యాణ్ మోడీ మెడ వంచుతాడా అని మాట్లాడుకుంటున్నారు. మోడీ సంగతి అందరికీ తెలిసిందే. మోడీతో పెట్టుకున్న వాళ్లంతా అధః పాతాళానికి తొక్కివేయబడ్డారు. చంద్ర బాబు కూడా పోయిన ఎన్నికలలో మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేసాడు. కానీ మోడీ 300 లకి పైగా సీట్లు సాధించడంతో, చంద్రబాబు జిత్తులు, ఎత్తులు చిత్తయ్యాయి. ఆ తర్వాత, మోడీ తో సఖ్యత కోసం ఎన్ని సంకేతాలు పంపినప్పటికీ, మోడీ పట్టించుకోలేదు.
పవన్ కళ్యాణ్ బి.జె.పి రోడ్ మాప్ ఇవ్వలేదని, ఆరోపిస్తూ చంద్ర బాబు తో సన్నిహితంగా మెలిగాడు. ఈ పరిణామాలని గమనిస్తున్న బి.జె.పి చంద్ర బాబు నాయుడు టి.డిపి తో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మరి ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ మోడీకి వ్యతిరేకంగా, చంద్ర బాబు ని సమర్థిస్తాడా, లేక చంద్ర బాబు అనుభవంతో గుణపాఠం నేర్చుకుని, మోడీ మెడలు వంచకుండా, అతని ముందు సాగిలపడతాడా అన్నది ఒక యక్ష ప్రశ్నగా మిగిలిపోయింది.