నటసింహ బాలకృష్ణ వెండితెర పై వీర, రౌద్ర విన్యాసాలు తెరపై అద్భుతంగా పండించగలడు. అతని కొన్ని చిత్రాలు చెన్నకేశవ రెడ్డి, సమరసింహారెడ్డి, లెజెండ్ మరియు అఖండ ఆ కోవలోకే చెందుతాయి. పోయిన ఏడాది బాలకృష్ణ అఖండగా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా చెలరేగాడో అందరికీ తెలిసినదే. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్వకత్వంలో ఒక మాస్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రానికి వీర సింహా రెడ్డి అనే అదిరిపోయే పవర్ ఫుల్ టైటిల్ ని నిన్న సాయంత్రం చారిత్రాత్మక కొండారెడ్డి బురుజు, కర్నూల్ లో ప్రకటించారు. అప్పటినుంచి బాలయ్య అభిమానులు వీర సింహా రెడ్డి అంటూ శివాలెత్తిపోతున్నారు.
ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం, గోపీచంద్ మలినేని ఈ చిత్రంలో బాలకృష్ణ పై గగుర్పొడిచే పోరాటసన్నివేశాలని చిత్రీకరిస్తున్నాడు. ఈ చిత్రంలో ఒకటి కాదు రెండు కాదు, గగుర్పొడిచే పోరాట సన్నివేశాలు మొత్తం పదకొండు ఉన్నాయని, అందులో బాలకృష్ణ వీర వీరవిన్యాసాలు చూస్తే అభిమానుల మతులు పోతాయని తెలుస్తోంది.
ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, దునియా విజయ్ ప్రతినాయకుని పాత్రని పోషిస్తున్నాడు. మలయాళీ నటి హనీ రోస్, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు. భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా అమ్మాయి చంద్రిక రవి ఈ చిత్రంలో ప్రత్యేక గీతంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు థమన్. బాలకృష్ణ వీర సింహ రెడ్డి గా సంక్రాంతికి సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు.