మీడియా లో విలువల వలువలకి ఎప్పుడో వస్త్రాపహరణం జరిగిపోయిందని అందరికి తెలిసినదే. ఇప్పుడు వాక్స్వాతంత్య్రం పేరుతొ ప్రతివాళ్ళు మీడియా ముసుగులో నెట్టింట తారల పై విషం చిమ్ముతూ నాట్యం చేస్తున్నారు. తెలుగువారిని తెలుగువారే అణగతొక్కేస్తారని అప్రహితంగా నిరూపిస్తున్నారు.
పర భాషా చిత్రాలు అద్భుత విజయాలు సాధిస్తున్నప్పుడు, ఆయా భాషల వాళ్ళు తమ తమ చిత్రాలని కళాఖండాలుగా అభివర్ణించుకుంటూ, కీర్తిస్తూ, అందులోని లోపాలని కప్పిపుచ్చచుకోవాలని తాపత్రయపడుతుంటారు. దానికి ఉదాహరణే తమిళ చిత్రం పొన్నియిన్ సెల్వన్ మరియు హిందీ చిత్రం బ్రహ్మాస్త్ర. అక్కడి ప్రజలు, మీడియా ప్రముఖులు అందరూ ఒక్కటై పైన ఉదహరించిన చిత్రాలని ప్రపంచంలోనే మరెవ్వరు తీయలేరని కొనియాడుతుంటారు.
మన దగ్గరికి వచ్చేసరికి, రాజమౌళి బాహుబలి చిత్రాన్ని ప్రపంచమంతా పొగుడుతుంటే, మనవారు చీల్చి చెండాడారు. అల్లు అర్జున్ పుష్ప, బాలకృష్ణ అఖండ, రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రాల విషయంలో జరిగినది అందరికి తెలిసినదే. ఒక సామాజిక వర్గం కారణంగానే బాలకృష్ణ అఖండ అఖండమైన విజయం సాధించిందని, ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రహసనం అంతా ఒక సామాజిక వర్గం ధన ప్రభావంతోనే జరిగిందని అవాకులు చవాకులు పేలారు. అదే సమయంలో పొరుగింటి పుల్లకూర రుచి అన్న చందాన, పర భాషా చిత్రాలని నెత్తినెట్టుకుని మోసారు. కుల,ప్రాంత, విద్వేషాలను రెచ్చ్చగొట్టే విధంగా, అభిమానుల మధ్య బేధాలు పెంచే విధంగా ప్రవర్తించి మొత్తం మీడియాకే మచ్చ తెచ్చారు.