నందమూరి నటసింహం బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న ఆహా ‘ఆన్‌స్టాపబుల్’ సీజన్ 2ని శుక్రవారం గ్రాండ్‌గా ప్రారంభించారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌కి గెస్ట్‌గా హాజరయ్యారు. అయితే ఇప్పటి వరకు ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్లుగా ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో.. వాటికి వివరణ ఇచ్చే ప్రయత్నం ఈ షో లో చేశారు. షో మధ్యలో మీరు తీసుకున్న ‘బిగ్ డెసిషన్’ ఏమిటి? అని బాలయ్య అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానమిస్తూ..
‘‘1995 డెసిషన్. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చాం. అధికారంలోకి వచ్చాం. అయితే.. దీనికి ముందే.. ఫ్యామిలీలో సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు చేశారు. ఐదుగురు ఆ నిర్ణయం వెనుక సాక్ష్యంగా ఉన్నారు. ఐదుగురం కలిసి ఒకరోజు ఎన్టీఆర్‌ను కలవడానికి వెళ్లాం. ఫ్యామిలీ గురించి మాట్లాడాలా? రాజకీయాలపై మాట్లాడాలా? అని అడిగారు. రాజకీయాల గురించి అయితే.. ఫ్యామిలీ సభ్యులు ఎవరూ రావద్దు. నువ్వు మాత్రమే రా అని చెప్పారు. అప్పుడు నాతో పాటు వచ్చిన వారిలో హరికృష్ణ, బాలకృష్ణ బయటకు వెళ్లిపోయారు.. ఆ తర్వాత 3 గంటలు చర్చించాము. నేను చాలా సేపు రిక్వెస్ట్ చేశాను. మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలకు ఒక మాట చెప్పమని చెప్పాను. చివరకు కాళ్లు కూడా పట్టుకుని అడుక్కున్నా. మీరు ఒక్క మీటింగ్ పెట్టి ధైర్యం ఇస్తే చాలండి.. ఇంకేం జరగదని చెప్పా. ఆయన వినలేదు. తర్వాత మీకు కూడా తెలిసిందే. రామాంజనేయ యుద్ధమే జరిగింది. అది చరిత్ర. ఎన్టీఆర్‌తో ముందుకు వెళ్లాలనేది అందరి అభీష్టం. అయినా.. వ్యక్తికన్నా.. ఆయన సిద్ధాంతాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఫ్యామిలీ అంతా ముందుకువెళ్లాం. అప్పుడు ఆ సమయంలో మీరు(బాలయ్య) కూడా ఉన్నారు కదా. ఆ సమయంలో మనం తీసుకున్న నిర్ణయం తప్పా? బయట నుంచి వచ్చిన వ్యక్తి ప్రభావం ఆయనపై పెరిగింది. ఆయన అడిగింది ఎప్పుడూ కాదనలేదు. అనేక ప్రయత్నాలు విఫలమయ్యాకే.. ఈ ‘నిర్ణయం’ తీసుకోవాల్సి వచ్చింది. ఆయనకు చాలా రకాలుగా చెప్పాం. ఆయనకు నమ్మినబంట్లుగా ఉన్నవారు కూడా చాలా సార్లు చెప్పారు. అయినా వినలేదు. మీరు చెప్పండి ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా?’’ అని చంద్రబాబు అడుగగా..
బాలయ్య మాట్లాడుతూ.. నేనూ కూడా చెప్పా. అయితే.. ఆయనే ఒక సంశయాత్మక స్థితిలో పడ్డారు. ఆ నిర్ణయం తప్పు కాదు! నందమూరి కుటుంబ సభ్యుడిగా చెబుతున్నా. ఒక పార్టీ మెంబర్‌గా చెబుతున్నా. ఒక పౌరుడిగా చెబుతున్నా. 1999 ఎన్నికలు అదే నిరూపించాయి. ఇవాల్టికీ ఆయన చరిత్రలో మిగిలారంటే.. తెలుగుదేశం పార్టీ ఆయనకు ఇచ్చిన గౌరవం.
మళ్లీ చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘తెలుగుదేశం పార్టీ నిరంతరం ఎన్టీఆర్ ఆశయాల సాధనకోసమే పనిచేస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతిని ఘనంగా నిర్వహిస్తున్నాం. ఎందరో నాయకులు వచ్చారు. కనుమరుగయ్యారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. తమిళనాడులో రామస్వామి నాయకర్ విషయంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆయన ఓ 20 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అప్పటి వరకు ఉన్నవారు ఆయనతో విభేదించారు. తర్వాత.. ఆయన సిద్ధాంతాలను మాత్రం ముందుకు తీసుకువెళ్లారు. అదే ఎన్టీఆర్ చరిత్ర కూడా. ఇది నా డెసిషన్ కాదు.. మన కుటుంబాల డెసిషన్. కుటుంబంలోని అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం..’’ అని చంద్రబాబు, బాలయ్యలు అప్పటి ఆరోపణలపై ఈ షో వేదికగా క్లారిటీ ఇచ్చారు.