రీసెంట్‌గా ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి మహాసహస్రవధాని గరికపాటి నరసింహారావు చేసిన కొన్ని వ్యాఖ్యలు.. వివాదంగా మారిన విషయం తెలిసిందే. చిరంజీవి అంటే అభిమానం ఉన్నవారు, చిరంజీవి గురించి తెలిసిన వారంతా.. అవధానిగారు అలా మాట్లాడటం ఏం బాగాలేదంటూ.. సీరియస్ అవుతున్నారు. చోట, ఉత్తేజ్, ప్రభు, అనంత శ్రీరామ్.. ఇలా ఒకరేంటి.. చిరంజీవి అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ విషయంపై తమదైన తరహాలో రియాక్ట్ అవుతూ.. గరికపాటి నరసింహారావుగారు చేసింది తప్పు అనేలా రియాక్ట్ అవుతున్నారు. కొత్తగా ఈ బ్యాచ్‌లోకి రామ్ గోపాల్ వర్మ వంటి వారు కూడా యాడ్ అవుతున్నారు. వాస్తవానికి ఈ విషయాన్ని చిరంజీవి అక్కడే సింపుల్‌గా ముగించేశారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని ఈజీగా తీసుకోలేదు. దీంతో ఈ అంశంపై ఏదో ఒక రకంగా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. బ్రహ్మణ సంఘాలు కూడా దీనిపై రియాక్ట్ అయ్యే పరిస్థితికి ఈ వివాదం వెళుతున్న నేపథ్యంలో మరోసారి చిరంజీవే కలగజేసుకుని.. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.
చిరంజీవి హీరోగా చేసిన ‘గాడ్‌ఫాదర్’ చిత్రం రీసెంట్‌గా విడుదలై.. పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిరంజీవి తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మీడియా గరికపాటి నరసింహారావు విషయంలో జరుగుతున్న వివాదంపై స్పందించాలని కోరగా.. ‘‘గరికపాటి నరసింహారావుగారు పెద్దాయన, గొప్ప వ్యక్తి. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు’’ అని చిరంజీవి స్పందించారు. దీంతో మరోసారి చిరంజీవి తన గొప్పమనసు చాటుకున్నారంటూ మెగాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి మెగాస్టార్ కూడా క్లారిటీ ఇచ్చేశారు కాబట్టి.. ఇంతటితో గరికపాటి వివాదం ముగుస్తుందనే భావిద్దాం.