డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తీసిన ‘లైగర్’ ఫ్లాపయింది కదా.. మరి హిట్టొచ్చిందంటారేంటని అనుకుంటున్నారా? దర్శకుడిగా ఆయన ఆ సినిమాతో ఫెయిల్ అయ్యాడు.. కానీ నటుడిగా ఆయన హిట్టు కొట్టాడు. ‘మంచోళ్లందరూ మంచోళ్లు కారు..’ అంటూ ఆయన నటించిన ‘గాడ్‌ఫాదర్’ సినిమా బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘గాడ్‌ఫాదర్’. ఈ సినిమాలో పూరీ జగన్నాధ్ ఓ జర్నలిస్ట్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. రియల్ లైఫ్‌లో పాడ్ క్యాస్ట్‌లతో ఫేమస్ అయిన పూరీని.. ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో అలాంటి తరహా పాత్ర కోసం చిరంజీవి సంప్రదించడం.. ముందు కాస్త భయపడినా.. మెగాస్టార్ అడుగుతున్నాడనే ధైర్యంతో, ఆయన పక్కనున్నాడనే భరోసాతో పూరి నటించడం జరిగిందనే విషయం స్వయంగా చిరంజీవే ఓ ఈవెంట్‌లో చెప్పారు.
‘గాడ్‌ఫాదర్’ సినిమాని నడిపే పాత్ర పూరీది. ఫస్టాఫ్‌లో పాత్రలను పరిచయం చేసిన పూరి.. సెకండాఫ్‌లో ఓ సన్నివేశంలో చెలరేగిపోయాడు. ఆ పాత్రకి పూరీనే చిరు ఎందుకు తీసుకోవాలని అనుకున్నాడు అనేదానికి.. పూరి 100 శాతం న్యాయం చేసి చూపించాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే పూరీ సన్నివేశానికి.. సినిమా చూస్తున్న జనం నవ్వకుండా ఉండలేరు. ఒక రకంగా పూరీకి ఇది మంచి బ్రేక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ‘లైగర్’ ఫ్లాప్‌తో ఆయన ఫ్యూచర్ అయోమయంలో పడింది. ఆ సినిమా తర్వాత అనౌన్స్ చేసిన ‘జనగణమన’ కూడా హోల్డ్‌లో ఉంది. ఈ టైమ్‌లో పూరీకి ‘గాడ్‌ఫాదర్’ సక్సెస్ మంచి రిలీఫ్ అనే చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమాతో సరిపెడతాడా? లేదంటే నటుడిగానూ ముందు ముందు పూరీ ప్రయోగాలు చేస్తాడా? అనేది కాలం డిసైడ్ చేస్తుంది.