పండగ రోజు సినిమా రిలీజ్ చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆదరిస్తారని చిన్నా, పెద్ద హీరోలకి ఉంటుంది. అది సహజం కూడా. అందుకే చాలామంది దసరా, దీపావళి, వినాయకచవితి, ఉగాది, క్రిష్టమస్, సంక్రాంతి పండగలకి సినిమాలు రిలీజ్ చేస్తారు. ఇటు పండగ అటు సెలవలు రెండూ కలిసొస్తాయని వారి నమ్మకం. అందుకే హీరోలు పండగ డేట్స్ ని వదులుకోరు. తాజాగా దసరా పండగకి మెగాస్టార్ చిరు-కింగ్ నాగార్జున తమ సినిమాలతో పోటీ పడగ.. ఈ పండగని ఎట్టిపరిస్థితుల్లో వదులుకోకూడదని కుర్ర హీరో, డెబ్యూ హీరో బెల్లంకొండ గణేష్ కూడా దసరా రోజునే తన సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకోచ్చేసాడు. గాడ్ ఫాదర్-ఘోస్ట్ మధ్యలో స్వాతి ముత్యం అన్నమాట.
అయితే గాడ్ ఫాదర్ కి హిట్ టాక్ వచ్చేసింది. స్వాతి ముత్యం కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ ఆడియన్స్ పాస్ మార్కులు వేసేసారు. ఘోస్ట్ యాక్షన్ మూవీగా మిగిలిపోయింది. అదే హీరో గణేష్, నిర్మాత నాగ వంశీలు స్వాతి ముత్యానికి మరో డేట్ చూసుకుంటే కలెక్షన్స్ పరంగా కొత్త నెంబర్లు నోట్ చేసేది. ఇప్పుడు చిరు గాడ్ ఫాదర్ కూడా హిట్ అవడంతో ఆ సినిమా ముందు స్వాతి ముత్యం వెలవెల బోతుంది. సినిమా బావుంది, క్రిటిక్స్ మంచి రేటింగ్స్ ఇచ్చారు. కానీ కలెక్షన్స్ కనిపించడం లేదు. కారణం పెద్ద సినిమాల మధ్యన రావడమే అని తేల్చేస్తున్నారు. అదే వేరే డేట్, వేరే చిన్న సినిమాల మధ్యన విడుదల చేసి ఇప్పటిమాదిరే ఫుల్ ప్రమోషన్స్ చేస్తే సినిమాకి కలెక్షన్స్ కళకళలాడేవి. మౌత్ టాక్, సోషల్ మీడియా టాక్ సూపర్ గా స్ప్రెడ్ అవుతున్నా జనాలు స్వాతి ముత్యాన్ని పట్టించుకోవడం లేదు. అందరూ గాడ్ ఫాదర్ వైపే చూస్తున్నారు. పాపం నిజంగా గణేష్ ఎరక్కపోయి వచ్చి చిరు-నాగ్ మధ్యలో ఇరుక్కుపోయాడనే చెప్పాలి.