ఇప్పుడు కుర్ర దర్శకులకు స్టార్ హీరోలను డైరెక్ట్ చేయాలనేది కల. ఆ అవకాశం వస్తే ఎగిరిగంతేయడం ఖాయం. ముఖ్యంగా చిరు, బాలయ్య వంటి వారితో సినిమా తీయాలనే డ్రీమ్‌తో ఇండస్ట్రీకి వచ్చిన దర్శకులెందరో ఉన్నారు. వారిలో కుర్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ఒకరు. ఆయనకి నందమూరి నటసింహం బాలయ్య అంటే పిచ్చి. ఆయనని ఒక్కసారైనా డైరెక్ట్ చేయాలి.. అనే డ్రీమ్ ఉన్న ప్రశాంత్ వర్మకు.. ఆ డ్రీమ్ తీరడమే కాదు.. ఇప్పుడు మరోసారి అతనికి ఆ అవకాశం వచ్చింది. అయితే బాలయ్యతో ప్రశాంత్ వర్మకి వచ్చింది సినిమా చేసే అవకాశం కాదు. తెలుగు ఓటీటీ ‘ఆహా’ టాక్ షో అన్‌స్టాపబుల్ ఛాన్స్. ఈ షోకి బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. సక్సెస్‌ఫుల్‌గా ఫస్ట్ సీజన్ కంప్లీట్ చేసుకున్న ఈ టాక్ షో.. ఇప్పుడు రెండో సీజన్‌కు రెడీ అవుతోంది. ఫస్ట్ సీజన్‌ను మించేలా ఈ షో ఉండబోతుందనేది.. తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ చూస్తుంటే తెలుస్తోంది.
‘‘బాలకృష్ణగారితో ఒక్కసారి వర్క్ చేయడమనేది కల.. రెండోసారి అనేది డెస్టినీ. అన్‌స్టాపబుల్ విత్ బాలకృష్ణ సీజన్ 2కి సంబంధించిన ప్రోమో షూట్ జరుగుతుంది. మొదటి సీజన్ ప్రోమోని అందరూ ఎంతగానో ఇష్టపడ్డారు.. ఈసారి అంతకుమించి ఉండబోతుంది. అక్టోబర్ 4న.. బాలయ్యను నెవ్వర్ బిఫోర్ అవతారంలో చూసేందుకు రెడీ అయిపోండి..’’ అంటూ ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. బాలయ్యతో రెండో ఛాన్స్ కూడా వచ్చిందంటే.. ఖచ్చితంగా ఆయనతో నీకు సినిమా ఛాన్స్ రాసిపెట్టుంది పో.. అంటూ ప్రశాంత్ వర్మ చేసిన ఈ ట్వీట్‌కు నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆయన పోస్ట్ చేసిన పిక్‌లో నిజంగానే బాలయ్య.. ఇంతకు ముందు కనిపించని విధంగా కనిపించబోతున్నట్లుగా భారీ ఖడ్గంతో దర్శనమిస్తున్నారు.