ఏజ్ ఆయనకు జస్ట్ నెంబర్ మాత్రమే.. ‘అదే రక్తం.. అదే ఎనర్జీ’ అని మరోసారి నిరూపించారు మెగాస్టార్ చిరంజీవి. కుర్రహీరోలు కూడా ఏడాదికి రెండు సినిమాలు చేయడానికి అల్లాడిపోతుంటే.. వరుస సినిమాలతో బాస్ ఆఫ్ మాసెస్‌గా ఆయన దూసుకుపోతున్నారు. ఇక ఆయన కామెడీ టైమింగ్‌ని మ్యాచ్ చేయడం ఎవరితరం కాదని.. మరోసారి అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకల సాక్షిగా చిరు నిరూపించారు. ఈ ఫంక్షన్‌లో చిరంజీవి మాట్లాడుతూ.. ఎలా ఎంటర్‌టైన్ చేశారంటే.. ఆడిటోరియం అంతా ఒకటే నవ్వులు, క్లాప్స్. ముఖ్యంగా తన పెళ్లి విషయంలో ఏం జరిగిందో చెబుతూ.. అల్లు రామలింగయ్య తనని ఎలా పరీక్షించారో, ఎలా మార్కులు వేశారో చెబుతూ.. మందు బాటిల్ మూత తీసే సన్నివేశాన్ని చేసి మరీ చూపించిన తీరుకి.. ఇది కదా బాస్ అంటే.. అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారంటే.. ఏ రేంజ్‌లో చిరు ఎంటర్‌టైన్ చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
వాస్తవానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. స్పీచ్ తర్వాత ఎవరేం మాట్లాడినా పెద్దగా రుచించదు. అసలు ఎక్కదు కూడా. సీతారామశాస్త్రి గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. ‘కొమ్మల్లో కుకూలు, కొండల్లో ఎకోలు’, ‘అర్థశతాబ్ధపు అజ్ఞానాన్ని స్వతంత్ర మందామా’.. అంటూ సీతారామశాస్త్రి సాహిత్యం గురించి చెబుతూ.. రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని.. ఎక్కడికి వెళ్లిపోతున్నానో తెలియకుండా అలా లేచెళ్లిపోతున్నాను.. అంటూ త్రివిక్రమ్ ఇచ్చిన స్పీచ్ ఇప్పటికీ, ఎప్పటికీ అలా నిలిచిపోతుంది. అలాంటి స్పీచ్‌నే మరోసారి అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకలలో త్రివిక్రమ్ ఇచ్చినా.. దానిని డామినేట్ చేసేలా చిరు ప్రసంగం సాగిందంటే.., ‘ఇలా ప్రేమగా, హాస్యంతో, హుందాతనంతో, పెద్దరికంగా మాట్లాడగల దమ్ము సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా ఉందా..’ అని కామెంట్స్ పడుతున్నాయంటే.. ఏ తరహాలో చిరు చించేశారో ఇంకా చెప్పాలా! ఆయన స్పీచ్ విన్నాక.. మెగాస్టార్ మీ సెన్సాఫ్ హ్యూమర్‌కి హ్యాట్సాఫ్.. అని చెప్పకుండా ఎలా ఉండగలం?.