మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపూర్ లో మెగా అభిమానుల మధ్యన అంగరంగ వైభవంగానే మొదలైనప్పటికీ.. చివరికొచ్చేసరికి ఆ ప్రాంగణం అంతా వర్షంతో తడిచి ముద్దయింది. మెగాస్టార్ అయితే ఆ వర్షంలోనే హుషారుగా ఫాన్స్ కి కిక్ ఇచ్చే స్పీచ్ ఇచ్చారు. గాడ్ ఫాదర్ గా మెగాస్టార్ చిరంజీవి ట్రైలర్ లో విశ్వరూపం చూపించారు. ఒకే ఒక్క డైలాగ్.. ఫాన్స్ కి పూనకాలు తెప్పించేసింది. రాజకీయాలకు దూరంగా ఉన్నాను, రాజకీయాలు నాకు దూరం కాలేదు అన్న డైలాగ్ కేవలం ఫాన్స్ కే కాదు అటు పొలిటికల్ గాను తీవ్ర చర్చలకు దారితీసింది. అదే అంశాన్ని మెగాస్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మట్లాడుతూ నేను చెప్పిన ఓ డైలాగ్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది అని, అది డిబేట్ లకు దారి తీసింది అంటూ ఆసక్తికరంగా మాట్లాడారు.
ఈ గాడ్ ఫాదర్ ఓ నిశ్శబ్ద విస్పోటనం. ప్లీజ్ మీ అందరి ఆశీస్సులు కావాలి. వర్షం పడుతున్నా.. మీరందరూ కదట్లేదు. ఇలాంటి ప్రేమను నేను కోరుకుంటున్నా. ఒక్క విషయం నేను చాలా సీన్సియర్‌గా చెబుతున్నా. గాడ్ ఫాదర్ అని మీరు నన్ను అంటున్నారు. కానీ ఏ గాడ్ ఫాదర్స్ లేకుండా వచ్చినా నాకు.. ఈ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా.. ఆ స్థితి ఇచ్చిన ప్రతి ఒక్క అభిమాని కూడా నాకు గాడ్ ఫాదర్. నా అభిమానులే నాకు గాడ్ ఫాదర్స్. నాకు గాడ్ ఫాదర్స్ ఎవరు లేరని అంటారు. కానీ.. ఇప్పుడంటున్నాను.. నా వెనుకలా ఇన్ని లక్షలమంది గాడ్ ఫాదర్స్ ఉన్నారు.. అంటూ మెగాస్టార్ ఎమోషనల్ అయ్యారు.
అంతేకాకుండా మెగాస్టార్ గాడ్ ఫాదర్ లోని ఓ డైలాగ్ ని బాణంలా వదిలారు. ప్రతి ఒక్కరు రోడ్డు కాంట్రాక్టులు, ఇసుక కాంట్రాక్టులు, కొండ కాంట్రాక్టులు, నీళ్ల కాంట్రాక్టులు, నేల కాంట్రాక్టులు, మద్యం కాంట్రాక్టులు అంటూ ప్రజల దగ్గర సొమ్ము తిని బలిసి కొట్టుకుంటున్నారు. ఈ రోజు మీ ఊపిరి, మీ గాలి కాంట్రాక్ట్ నేను తీసుకుంటున్నాను. సుపరిపాలన, సుపరిపాలన అందివ్వాలన్న నిర్ణయం, తప్పు చేయాలంటే భయం తప్ప మీ మనసులో ఏది ఉండకూడదు. ఏదైనా జరగకూడదని జరిగిందో, మీ ఊపిరి ఆగిపోతుంది, ఖబడ్దార్.. అంటూ చిరు చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ సినిమాలో కాబట్టి సరిపోయింది.. అదే రాజకీయంగా అయితే విషయం మాములుగా ఉండేది కాదు అంటూ మెగా ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.