సినిమా పరంగా ఎన్నో సాహసాలు చేసిన వ్యక్తికి జీవితం ఇప్పుడు కొత్త పరీక్షలు పెడుతోంది.
ఎందరికో ఎన్నో సహాయాలు చేసిన వ్యక్తికి విధి సహకరించకుండా సమస్యలు సృష్టిస్తోంది.
తోడుగా ఉన్న భాగస్వామిని, నీడలా మెలిగిన అనుచరుణ్ణి, అండగా ఉండాల్సిన జేష్ఠ పుత్రుణ్ణి, ఆలంబనగా నిలవాల్సిన ధర్మపత్నిని.. ఇలా ఒక్కొక్కరిని ఆయనకి దూరం చేస్తూ కంటతడిని ఆరనివ్వడం లేదు. కొంతైనా ఆయన్ని సేదతీరనివ్వడం లేదు.
కృష్ణగారు ప్లీజ్ స్టే స్ట్రాంగ్..
ప్రస్తుతం ఆయన వయసు 79 ఏళ్ళ. ఈ వయసులో కృష్ణగారి హృదయానికి వరసగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడం, ఆయన్ని గుండె కోతకు గురి చేస్తూ ఉండడం సన్నిహితుల్ని, శ్రేయోభిలాషుల్ని, అభిమానుల్ని అందరినీ కలవరపెడుతోంది. కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తోంది.
ఎన్నో ఏళ్లు కృష్ణగారితో కలిసి జీవించిన విజయ్ నిర్మల ముందుగా ఆయనకి దూరమవగా.. అన్నే ఏళ్ళు ఆయన్ని వెన్నంటే ఉన్న అనుచరుడు బి.ఏ రాజు, ఆపై కృష్ణగారి పెద్ద కొడుకు రమేష్ బాబు, ఇప్పుడు ఆయన భార్య ఇందిరా దేవి దూరమవడం ఈ వయసులో ఆయన్ని ఎంత మానసిక క్షోభకు గురి చేస్తుందో అందరం అర్ధం చేసుకోవచ్చు. ఇటువంటి దశలో అయన మనో నిబ్బరంతో ఉండాలని.. ఆ మనోస్థైర్యానికి విధి వీలునివ్వాలని కోరుకుందాం.
కృష్ణ గారూ.. మా జేమ్స్ బాండ్ మీరు. మా కౌబాయ్ హీరో మీరు. మాకు తెలిసిన అల్లూరి సీతారామరాజు మీరే. మేము చుసిన ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ మీరే. కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసారు. ఎదుర్కొన్నారు. ఎన్నో సవాళ్ళను స్వీకరించారు. సత్తా చాటి చూపించారు. మీ గట్స్ కి మేము ఎప్పుడో హేట్స్ ఆఫ్ చెప్పాము. ఇప్పుడూ చెప్పే అవకాశం ఇవ్వండి. మీరు నిబ్బరంగా ఉండాలని అశేష అభిమానులతో పాటు యావత్ చిత్ర పరిశ్రమంతా కోరుకుంటోంది.
మీకు వచ్చిన కష్టం తీర్చలేనిది.
మీకు జరిగిన నష్టం పూడ్చలేనిది.
తట్టుకోండి కృష్ణ గారు.. మిమ్మల్ని అమితంగా ఆరాధించే అభిమానుల కోసం.
ఓర్చుకోండి కృష్ణ గారు .. మీ మంచి వ్యక్తిత్వానికి దాసోహమైన మా అందరి కోసం..!