సూపర్ స్టార్ కృష్ణ ఇంట మరో విషాదం నెలకొంది. ఆయన సతీమణి, మహేష్ బాబు తల్లిగారైనటువంటి ఇందిరాదేవి (70).. బుధవారం వేకువ జామున అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మరణంతో ఘట్టమనేని ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. కృష్ణ పెద్దకుమారుడు రమేష్ బాబు మరణించి సంవత్సరం కూడా కాకుండానే.. ఆ ఇంట మరో విషాదం నెలకొనడం బాధాకరం. ఇందిరా దేవి మరణవార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు, ఘట్టమనేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తూ.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. మహేష్ బాబుకి తల్లి ఇందిరా దేవి అంటే ఎనలేని ప్రేమ. ఆమె మరణంతో మహేష్ బాబు తీవ్ర దు:ఖ సాగరంలో మునిపోయారు.
కృష్ణ-ఇందిరాదేవి దంపతులకు ఐదుగురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ముగ్గరు అమ్మాయిలు. రమేష్‌బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. రీసెంట్‌గా రమేష్ బాబు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందిరాదేవి అంతిమ సంస్కారాలు ఈ రోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నట్లుగా తెలుస్తుంది. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు అభిమానుల సందర్శనార్ధం ఇందిరాదేవి పార్ధివదేహాన్ని పద్మాలయా స్టూడియోలో ఉంచనున్నారు.