మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ చిత్రం అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో యాంకర్ శ్రీముఖి చేసిన ఇంటర్వ్యూ ఒకటి మేకర్స్ విడుదల చేయగా.. ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు సినిమాపై బీభత్సమైన హైప్‌కి కారణమవుతోంది. ఈ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన అనేక విషయాలను చిరంజీవి షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా ఇంతకు ముందు చిరంజీవి సినిమాలలో లేనిది.. ఈ సినిమాకి మాత్రమే ప్రత్యేకమైన ఓ పాయింట్‌ని శ్రీముఖి.. మెగాస్టార్‌ని అడిగింది. అదేంటంటే.. హీరోయిన్ లేకుండా, పాటలు లేకుండా ఇలాంటి సబ్జెక్ట్‌ని ఎంచుకోవడానికి కారణం ఏమిటి? అని శ్రీముఖి అడిగిన ప్రశ్నకు చిరు సమాధానమిస్తూ..
‘‘నిజమే.. హీరోయిన్ లేకుండా, సాంగ్స్ లేకుండా ఇప్పటి వరకు నా సినిమాలు లేవు. ఎప్పటికప్పుడు ప్రేక్షకులు కొత్తదనం ఇవ్వాలని ప్రయత్నించిన నాకు.. ఇంత ఇమేజ్ వచ్చిన తర్వాత వైవిధ్యానికి ఎందుకు తావివ్వకూడదనే ఆలోచనలో ఉన్న నాకు.. మోహన్‌లాల్ చేసిన ‘లూసిఫర్’ చూసినప్పుడు.. ఈ యాంగిల్‌లో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నట్లుగా ఉంటుంది.. ఎందుకు చేయకూడదని అనుకున్నాను. నా క్లోజ్ ఫ్రెండ్స్‌కు కూడా ఈ విషయం చెబితే ఎంకరేజ్ చేశారు. ఈ సబ్జెక్ట్ ఎలా ఉంటుందీ అంటే.. హీరోయిన్ లేదని కానీ, సాంగ్స్ లేవని కానీ.. అలాంటి ఆలోచనే రానివ్వకుండా.. చాలా గ్రిప్పింగ్‌గా ఒకవైపు పొలిటికల్ డ్రామా, మరోవైపు ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. ఆ ఘట్ ఫీలింగ్‌తోనే ఈ సినిమాని సెలక్ట్ చేసుకోవడం జరిగింది. నా ఊహ, అంచనా తప్పుకాదన్నది.. తాజాగా పూర్తి స్థాయిలో చిత్ర రషెస్ చూసిన తర్వాత.. ఎస్.. ఐ యామ్ రైట్ అని అనిపించింది’’ అని చిరు చెప్పుకొచ్చారు.