అల్లు ఫ్యామిలీ అయోమయంలో పడిందా? అంటే అవునని చెప్పక తప్పదు. మెగా ఫ్యామిలీ నుండి విడిపోయి అల్లు ఫ్యామిలీ అని ప్రత్యేక ముద్ర వేయించుకోవడం కోసం ‘ఆర్మీ’తో హల్‌చల్ చేస్తున్న అల్లు హీరోలు.. ఇప్పుడు వారిలో వారే కన్ఫ్యూజన్‌కి గురవుతున్నారు. ఈ కన్ఫ్యూజన్‌కి కారణం దిల్ రాజు - గుణశేఖర్ అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అదెలా అనుకుంటున్నారా? అప్పుడెప్పుడో అల్లు శిరీష్ హీరోగా ‘ప్రేమ కాదంట’ అనే చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నట్లుగా ప్రకటించారు. మధ్యలో అను ఇమ్మాన్యుయేల్‌తో అల్లు శిరీష్ కలిసున్న ఫొటోలను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత ఆ సినిమాకి సంబంధించి ఎటువంటి అప్‌డేట్ లేదు. మళ్లీ ఇన్నాళ్లకి ఈ సినిమాని నవంబర్ 4న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడిదే వారికి పెద్ద చిక్కుగా మారింది.
సమంత హీరోయిన్‌గా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన దృశ్యకావ్యం ‘శాకుంతలం’ చిత్రాన్ని కూడా అదే రోజున విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాని దిల్ రాజు విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో అల్లు ఫ్యామిలీకి చెందిన ఓ బుల్లినటి కూడా పరిచయం కాబోతోంది. అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువరాజు భరతుడి పాత్రలో నటించింది. అదే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కాబోతోంది. ఆమె పాత్ర అద్భుతంగా వచ్చినట్లుగా ఇన్ సైడ్ వర్గాల ద్వారా కూడా తెలుస్తుంది. సో.. అన్న కుమార్తె, తను కూడా ఎంతో ముద్దు చేసే అల్లు అర్హ కోసం అల్లు శిరీష్ వెయిట్ చేస్తాడా? లేదంటే పోటీకి దిగుతాడా? అనేదే ఇప్పుడున్న కన్ఫ్యూజన్. ఈ విషయం అల్లు అభిమానులను కూడా అయోమయానికి గురి చేస్తోంది. చూద్దాం మరి.. నవంబర్ 4న ఏం జరుగుతుందో?