సౌత్, నార్త్ అనే సరిహద్దులను చెరిపేస్తూ.. ఇప్పుడున్న హీరోలు అన్ని భాషలలో తమ చిత్రాలను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ ప్రతి ఇండస్ట్రీలో తాండవం చేస్తుంది. చిన్న హీరోల నుండి స్టార్ హీరోల వరకు.. తమ చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఎటువంటి ప్రయత్నం చేయకుండా.. కేవలం నటనతోనే మలయాళ నటుడు దుల్కర్ పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్‌ని సొంతం చేసుకుంటూ.. పాన్ ఇండియా క్రేజ్ కి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాడు. మలయాళంలో మంచి నటుడిగా పేరొందిన దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు ‘సీతా రామం’ చిత్రంతో సౌత్ మొత్తాన్ని అలరించడమే కాకుండా.. ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ని సొంతం చేసుకున్నాడు. ‘మహానటి’ చిత్రంతో జస్ట్ టచ్ చేసిన దుల్కర్.. ‘సీతా రామం’ చిత్రంతో ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పుడు నార్త్ ప్రేక్షకులు కూడా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు.
ఆయన నటించిన బాలీవుడ్ చిత్రం ‘చుప్’ నార్త్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘చుప్’ సినిమాకే కాకుండా.. ప్రత్యేకంగా దుల్కర్ నటనకు అక్కడి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారంటే.. ఆయన దూసుకెళుతున్న మార్గం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదేదీ ఆయన ప్రత్యేకంగా ప్లాన్ చేసింది కాదు. ఆయన ఎన్నుకునే డిఫరెంట్ పాత్రలే.. దుల్కర్‌ని ప్రేక్షకులకు దగ్గర చేస్తున్నాయి. పాన్ ఇండియా హీరోకి పరిపూర్ణ నిర్వచనంలా దుల్కర్ మారాడని చెప్పుకోవడానికి ఇంతకంటే ఏం కావాలి. గుడ్ గోయింగ్ దుల్కర్.. కంటిన్యూ కంటిన్యూ.