ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న మాట.. ‘ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు’. అసలు ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావడం లేదు? మొన్నటి వరకు అంటే కరోనా భయం ఉంది. ఇప్పుడేమైంది? మరి.. ప్రేక్షకులు థియేటర్లకి రాకపోతే.. ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ2’ చిత్రాలు ఎందుకు సక్సెస్‌ఫుల్ చిత్రాలుగా నిలిచాయి? కంటెంట్ ముఖ్యమని ఒకరు, దర్శకుల తప్పిదమని మరొకరు ఇలా ఒకరిపై ఒకరు నిందించుకుంటున్నారు తప్ప.. అసలు విషయం ఏమిటనేది ఎవరూ గ్రహించలేకపోతున్నారు. అలాంటి వారందరికీ తాజాగా ‘నేషనల్ సినిమా డే’ కళ్లు తెరిపించి ఉంటుందనే భావించాలి. ఎందుకంటే, సెప్టెంబర్ 23 నేషనల్ సినిమా డేని పురస్కరించుకుని, ఆ ఒక్క రోజు మల్లీప్టెక్స్‌తో పాటు ఇతర థియేటర్లలో కూడా అన్ని టికెట్లను రూ. 75 రూపాయలకు తగ్గించారు. సౌత్ థియేటర్లలో చాలా మంది దీనిని ఫాలో కాలేదు కానీ.. నార్త్ వాళ్లు మాత్రం పక్కాగా దీనిని అమలు చేశారు. దీంతో.. ఆ ఒక్కరోజే దాదాపు 65 లక్షల మంది థియేటర్లకు వచ్చి సినిమాలు చూసినట్లుగా రిపోర్ట్స్ చెబుతున్నాయి.
మరి ఈ లెక్క ప్రకారం.. తప్పిదం ఎక్కడ జరుగుతుందనేది మేకర్స్ గ్రహించాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు.. సినిమా బడ్జెట్ పెంచేసుకుంటూ.. టికెట్ల ధరలు పెంచేసుకుంటూ.. ప్రేక్షకులపై భారం మోపాలని చూస్తే.. వారెందుకు కామ్‌గా ఉంటారు. అందుకే థియేటర్లకు రావడం మానేశారు. మరోవైపు ఓటీటీ ఒత్తిడి ఉన్నా కూడా.. మేకర్స్ మేల్కొనకపోవడం విడ్డూరమనే చెప్పుకోవాలి. మంచి కంటెంట్, సరసమైన ధరకు సినిమా టికెట్ లభిస్తే.. ఖచ్చితంగా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అందుకు నిదర్శనం.. ‘నేషనల్ సినిమా డే’నే. మరి ఇంత జరుగుతున్నా... ప్రేక్షకులు ఇంతగా హింట్ ఇస్తున్నా.. సెప్టెంబర్ 30న విడుదల కాబోయే ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రానికి భారీగా టికెట్ ధరలను పెంచేసినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రానికి రూ. 295 టికెట్ ధరలతో అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలైనట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాకి విడుదల తర్వాత టాక్ బాగుంటే ఓకే గానీ.. ఏ మాత్రం తేడా కొట్టినా.. సినిమాని కొనుక్కున్న వారి పరిస్థితి ఏంటో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.