కొన్నాళ్లుగా టిడిపి లోకి జూనియర్ ఎన్టీఆర్ రావాలి అంటూ తెలుగు తమ్ముళ్లు బలంగా కోరుకోవడమే కాదు, తారక్ ని టిడిపి పగ్గాలు చేపట్టాలంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. చంద్రబాబు కొడుకు లోకేష్ ఉండగా.. తారక్ ని రాజకీయాల్లోకి తీసుకువస్తే.. తారక్ ముందు లోకేష్ డల్ అవుతాడనే భయంతోనే తారక్ ని అటు ఫ్యామిలీకి, ఇటు పార్టీకి దూరం పెడుతున్నారు చంద్రబాబు అని చాలామంది వాదిస్తున్న విషయమే. అయితే ఎవరైతే తారక్ ని టిడిపిలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారో ఇప్పుడు వారే తారక్ ని తప్పుపడుతున్నారు.
తాతగారి పేరు మీదున్న హెల్త్ యూనివర్సిటీకి జగన్ ప్రభుత్వం వైఎస్సార్ పేరు పెడతామంటూ బిల్ ప్రవేశపెట్టారు. దానితో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై టిడిపి నేతలు భగ్గుమంటున్నారు. కానీ తారక్ మాత్రం ఎన్టీఆర్ తో పాటుగా రాజశేఖర్ రెడ్డి కూడా గొప్పవాళ్లే, ఇద్దరూ మహనీయులే. ఎన్టీఆర్ పేరు తీసేస్తే ఆయన కీర్తి తగ్గదు, వైఎస్సార్ పేరు పెడితే ఆయన కీర్తి పెరగదు అంటూ అర్ధం పర్ధం లేని ట్వీట్ చెయ్యడంతో ఇప్పుడు టిడిపి నేతలే గుర్రుమనేలా చేసాయి. అంటే తాతగారి విషయంలోనే ఇలా ఉన్న తారక్ రేపు రాజకీయాల్లోకి తీసుకొస్తే.. ఎలా ఉంటుందో అనే ఆందోళన టిడిపి తమ్ముళ్లలో మొదలయ్యింది. అయితే తారక్ ని టిడిపిలోకి రానివ్వకుండా ఉండేందుకు కొంతమంది టిడిపి నేతలు ఇలా తారక్ ని నెగెటివ్ గా చూపిస్తున్నారు అని వాదించేవాళ్ళు లేకపోలేదు.