ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు పై స్పందించిన తారక్ అటు కర్ర విరక్కుండా, ఇటు పాము చావకుండా వ్యవహరించినట్లుగా కనిపిస్తుంది ఇప్పుడు అందరికి. ఎన్టీఆర్ లాంటి మహనీయుడితో వైఎస్సార్ ని పోల్చడం ఎన్టీఆర్ అభిమానులని బాగా హార్ట్ చేసింది. ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెడితే ఎన్టీఆర్ కీర్తి తగ్గిపోదు, అలాగే వైఎస్సార్ కీర్తి పెరిగిపోదు అంటూ అటు ఇటుగా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ పై అన్నగారి అభిమానులు గరంగరంగా ఉన్నారు. అసలు ఎన్టీఆర్ అన్నగారిని పొగిడాడా.. వైఎస్సార్ ని కీర్తించాడా.. అనేది ఎన్టీఆర్ అభిమానులకే అర్ధం కావడం లేదు.
సినిమాల్లో తాతగారి హావభావాలు, తాతగారి రూపం తో ఉన్నారు అంటూ అందరూ జూనియర్ ఎన్టీఆర్ ని పొగుడుతుంటారు. నటనలో తాతగారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడని, జూనియర్ ని చూస్తే అన్నగారే గుర్తుకు వస్తారంటూ సీనియర్ ఎన్టీఆర్ అభిమానులే అంటుంటారు. టీడీపీ తరపున ప్రచారానికి వెళ్ళినప్పుడు సీనియర్ ఎన్టీఆర్ లా ఖాకి వస్త్రాలు ధరించి మరీ ప్రచారంలో పాల్గొని, సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్ తో ప్రజలని ఉర్రుతలూగించారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు తాతగారి పేరు మార్పు పై స్పందించిన తీరుతో తెలుగు తమ్ముళ్లు ఖంగు తిన్నారు. ఎన్టీఆర్ మనవడిగా ప్రౌడ్ గా చెప్పుకునే ఎన్టీఆర్ కి తాతగారి పౌరుషం, తాతగారి వారసత్వం ఏమైంది అంటూ మాజీ మంత్రి పీతల సుజాత లాంటి వారు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.
కనీసం వైఎస్ షర్మిల స్పందించినట్టుగా కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదని తెలుగు తమ్ముళ్ళతో పాటు, అన్నగారి అభిమానులు సోషల్ మీడియాలో జూనియర్ పై దాడికి దిగుతున్నారు.