ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మారుస్తూ ఓ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యులు ఆందోళనలు చేస్తున్నారు. చంద్రబాబు, మిగతా టిడిపి నేతలు ఎన్టీఆర్ యూనివర్సిటీ మార్చడం అనేది దారుణమంటూ పోరాడుతున్నారు. ఈ పేరు మార్పుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన కొద్దిసేపటికే కళ్యాణ్ రామ్ రియాక్ట్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ NTR హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం వలన ఎన్టీఆర్ కీర్తి తగ్గదు, వైఎస్సార్ కీర్తి పెరగదు అంటే.. కళ్యాణ్ రామ్ మాత్రం పేరు మార్పు కేవలం రాజకీయం కోసమే అన్నారు. కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ..
1986 లో విజయవాడ మెడికల్ కాలేజీ స్థాపించబడింది. ఆంధ్రాలోని మూడు ప్రాంతాల విద్యార్థులకి నాణ్యమైన వైద్య, విద్యని అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న శ్రీ ఎన్టీఆర్ గారు ఈ మహావిద్యాలయానికి అంకురార్పణ చేసారు. ఈ వైద్య, విద్య విశ్వ విద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందింది. లెక్కలేనన్ని నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులని దేశానికి అందించింది. తెలుగు రాష్ట్రాల్లోని వైద్య అధ్యయనాల మెరుగుదలకు ఆయన చేసిన కృషిని స్మరించుకునేందుకు విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అఫ్ హెల్త్ సైన్స్ గా మార్చబడింది.
ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. 25 ఏళ్ళకి పైగా ఉనికిలో ఉన్న ప్రతిష్టాత్మకమైన విద్యాలయం పేరు మార్చడం నాకు బాధ కలిగించింది. కేవలం రాజకీయ లాభం కోసం చాలామందికి భావోద్వేగాలతో ముడిపడివున్న ఈ అంశాన్నివాడుకోవడం తప్పు అంటూ ట్వీట్ చేసారు.