సినిమాల్లో మెగాస్టార్ గా గుర్తింపు పొందిన చిరంజీవి తర్వాత రాజకీయాలని టార్గెట్ చేసి ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. గ్రాండ్ గా పొలిటికల్ ఎంట్రీ జరిగినా.. చిరు రాజకీయాలను మాత్రం శాసించలేకపోయారు. దానితో పొలిటికల్ గా ఫెయిల్ అయిన మెగాస్టార్ మళ్ళీ సినిమాల్లోకి వచ్చేసారు. రాజకీయాలను పూర్తిగా పక్కనబెట్టేసి వరస ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యారు. గాడ్ ఫాదర్-భోళా శంకర్-మెగా 154 షూటింగ్స్ తో బిజీగా ఉంటున్న మెగాస్టార్ సడన్ గా టోన్ మార్చారు. మరోసారి రాజకీయాలతో ముడిపడిన వ్యాఖ్యలతో హైలెట్ అయ్యారు.
ఈ రోజు చిరంజీవి ట్విట్టర్ హ్యాండిల్ నుండి సడన్ గా ఓ పోస్ట్ ప్రత్యక్షమయింది. ఆ పోస్ట్ లో చిరు పెట్టిన వాయిస్ రికార్డ్ చూస్తే చిరు మరోసారి రాజకీయాల్లోకి రాబోతున్నారా అనిపించేలా ఉన్నాయి. నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు అంటూ చిరు వాయిస్ ఓవర్ తో ఉన్న ఆడియో వైరల్ అయ్యింది. అసలు ఉన్నట్టుండి చిరు ఇలాంటి కామెంట్స్ చెయ్యడం ఏమిటి, ఆయన నటిస్తున్న సినిమా డైలాగ్ ఏమైనా చెప్పారా.. లేదంటే రాజకీయాల గురించే ఆయన కామెంట్స్ చేసారా.. అనే దానిపై అప్పుడే అటు పొలిటికల్ గాను, ఇటు సినిమా ఇండస్ట్రీలో చర్చలు మొదలైపోయాయి. ఎలాగూ బీజేపీ నేతలు చిరుని తమ పార్టీలోకి తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఉన్న టైం లో చిరు నుండి రాజకీయాలపై వచ్చిన ఈ కామెంట్స్ మాత్రం వైరల్ గా మారాయి.