అనారోగ్య కారణాలతో ఈ రోజు తెల్లవారు ఝామున కన్ను మూసిన కృష్ణం రాజు భౌతిక కాయాన్ని చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి తరలి వెళుతున్నారు. ఆదివారం ఉదయం గుండెపోటుతో AIG ఆసుపత్రిలో మృతి చెందిన కృష్ణ రాజు గారి భౌతిక కాయాన్ని కొద్దిసేపటి క్రితమే కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ ఆయనకి పుష్ప గుచ్చాలు ఉంచి నివాళుర్పించారు. ప్రభాస్ ఉదయాన్నే పెదనాన్న కృష్ణ రాజు గారి ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులని ఓదార్చగా.. చిరంజీవి, మోహన్ బాబు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, మంచు విష్ణు, వెంకటేష్, కిషన్ రెడ్డి తదితరులు కృష్ణ రాజుగారి కి నమస్కరించి నివాళు అర్పిస్తున్నారు.
అభిమానుల సందర్శనార్థం కృష్ణం రాజు భౌతిక కాయాన్ని యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియం కి తరలించనున్నారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహిస్తారు అని తెలుస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్ సోమేశ్ కుమార్ కి ఆదేశాలు జారీ చేశారు. కృష్ణంరాజు కేంద్ర మాజీ మంత్రి మాత్రమే కాదని, తనకు అత్యంత ఆప్తుడని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణం రాజుగారి అంత్యక్రియలు నిర్వహించాలన్న కేసీఆర్ ఆదేశాలతో సీఎస్ సోమేశ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.