రెబల్ స్టార్ కృష్ణంరాజు హఠాన్మరణంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివారం ఉదయం 3 గంటల 25 నిమిషాలకు.. హైదరాబాద్ AIG హాస్పిటల్‌లో చికిత్స పొందరూ ఆయన మృతిచెందారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు చనిపోవడానికి గల కారణాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ కోవిడ్ సమస్యతో ఇబ్బందిపడుతున్న కృష్ణంరాజుకు శనివారం రాత్రి సడెన్‌గా గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ హస్పిటల్‌కి తరలించారు. డాక్టర్స్ ఎంతగా శ్రమించినా.. కృష్ణంరాజు కోలుకోలేకపోయారు. ఆదివారం తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు.. ఈ రోజు ఉదయం చనిపోవడానికి కారణం గుండెపోటు అని తెలుస్తుంది.
ఇక కృష్ణంరాజు మరణవార్త తెలిసిన టాలీవుడ్ సినీ ప్రముఖులే కాకుండా.. ఆయనతో పరిచయం ఉన్న ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తున్నట్లుగా పేర్కొంటున్నారు. ప్రధానమంత్రి మోదీతో పాటు కేసీఆర్, వైఎస్ జగన్, చంద్రబాబు వంటి వారే కాకుండా.. రాజకీయ నేపథ్యం ఉన్న పలువురు ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ట్వీట్స్ చేశారు. ఇక టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి మొదలుకుని, బాలయ్య, మోహన్ బాబు, వెంకటేష్, నాగార్జున, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నిఖిల్.. ఇలా ఇండస్ట్రీలోని అందరూ నివాళులు అర్పిస్తూ.. కృష్ణంరాజు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని తెలుపుతూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతిని తెలుపుతున్నారు.