టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ రెబల్ స్టార్, ప్రభాస్‌కి పెదనాన్న అయిన కృష్ణంరాజు ఆదివారం ఉదయం 3 గంటల 25 నిమిషాలకు.. హైదరాబాద్ AIG హాస్పిటల్‌లో చికిత్స పొందరూ మృతిచెందారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజును ఫ్యామిలీ సభ్యులు AIG హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. గత రాత్రి ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ప్రస్తుతం ఆయన వయసు 83 సంవత్సరాలు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
వాస్తవానికి శనివారం ప్రభాస్‌కి చెందిన ఒక వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అయినప్పుడే.. కృష్ణంరాజు ఆరోగ్యంపై అనుమానాలు వచ్చాయి. కృష్ణంరాజుకి సీరియస్‌గా ఉందని, అందుకే ప్రభాస్ హుటాహుటిన హాస్పిటల్‌కి వెళ్లారనేలా వార్తలు వినబడ్డాయి. ఆ వీడియో దర్శనమిచ్చిన కాసేపట్లోనే.. కృష్ణంరాజు కన్నుమూయడం బాధాకరం. తెలుగు సినిమా పరిశ్రమలో కృష్ణంరాజుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నంది అవార్డ్స్ ఇవ్వడం మొదలెట్టాక.. మొట్టమొదటి నంది అవార్డు అందుకున్న నటుడాయన. 1966లో ‘చిలకా గోరింక’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన కృష్ణంరాజు.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించారు. కత్తుల రత్తయ్య, బొబ్బలి బ్రహ్మన్న, భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య వంటి చిత్రాలు పేర్లు వినబడితే.. కృష్ణంరాజు రూపమే గుర్తొస్తుంది. అంతలా ఆ పాత్రలతో ఆయన ప్రేక్షకులలోకి మమేకమయ్యారు.
కృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో 20 జనవరి, 1940న జన్మించారు. పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు. కెరీర్ మొదట్లో విలన్‌గానూ నటించిన కృష్ణంరాజు.. ఆ తర్వాత హీరో అంటే ఇలా ఉండాలిరా అని అనిపించుకునేలా.. అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. చివరిగా ఆయన నటించిన చిత్రం ‘రాధే శ్యామ్’. కృష్ణంరాజు హఠాన్మరణ వార్తతో ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణ వార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిద్దాం.