‘‘ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉండి ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదాలు తీర్చే పెద్దరికం నాకవసరం లేదు. కానీ కష్టమని నా ఇంటి ముందు కొస్తే మాత్రం.. ఆ కష్టాన్ని తీర్చడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తా..’’. ఇవి, ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఓ వేదికపై చెప్పిన మాటలు. ఆయన సహాయం పొందడానికి ఇంటి ముందుకే వెళ్లాల్సిన అవసరం లేదు. మనసులో గట్టిగా ఆయన పేరు తలుచుకున్నా చాలు.. పొరుగువాడి కష్టం ఆయనకి అర్థమైపోతుంది.. వెంటనే సాయం చెంతకే వస్తుంది. సాయం చేయడంలో వెన్నెముక లేని చేయి తనది. ఈ రోజు ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములు కూడా.. కష్టం వస్తే, ఒకరికొకరు సహాయం చేయడానికి, చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. అలాంటిది.. అన్నయ్యా.. అని ఆప్యాయంగా పిలిస్తే చాలు.. నేనున్నానంటూ, ఆ పిలిచిన వారింట్లో పెద్దన్నగా మారి.. వారి కష్టాన్ని తన కష్టంగా భావించి.. దానిని తరిమి కొట్టేంత వరకు విశ్రాంతి తీసుకోని గొప్పమనసు చిరంజీవిది. ఆ మనసెంటో ఇప్పటికే పలు సందర్భాలు తెలియజేశాయి. ‘ఈ చిరంజీవి ఎవరయ్యా.. కలియుగ దాన కర్ణుడులా ఉన్నాడు’ అనేలా మాట్లాడుకునేలా చేశాయి.. చేస్తూనే ఉన్నాయి. అందుకు నిదర్శనమే.. ‘చిరు బ్లడ్ బ్యాంక్’, ‘చిరు ఐ బ్యాంక్’, ‘ఆక్సిజన్ బ్యాంక్’. అయితే ఇవన్నీ బయటికి తెలిసినవి.. తెలియకుండా ఆయన సాయం పొందిన వారెందరో ఉన్నారు. సాటి మనిషి కష్టాన్ని దూరం చేయడానికే చిరు అంత చేస్తే.. ఆ కష్టంలో ఉంది స్వయంగా తనని అభిమానించే అభిమాని అని తెలిస్తే.. చిరు తట్టుకోగలడా?.
అందుకే తనని ఆరాధించే వారి కోసం, అభిమానించే వారి కోసం.. ‘చిరు భద్రత’ పేరుతో వారికి లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్‌లు చేయించి.. మీ అందరికీ నేనున్నానంటూ చిరంజీవి ఇచ్చిన భరోసా.. అచిరకాలం నిలిచిపోతుంది. ఇక తన అనుకున్న అభిమానుల పట్ల చిరంజీవి ప్రేమ ఏవిధంగా ఉంటుందో తాజాగా మరోసారి రివీలైంది. తన అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి.. ఆర్థిక సాయం చేయడమే కాకుండా.. ఓ లేఖ రాసి మరీ తనని అక్కున చేర్చుకున్న తీరు.. ప్రతి ఒక్కరి మనసులో చిరుకు గుడి కట్టేలా చేస్తోంది. చిరంజీవిని దూరంగా ఉండి చూస్తే చాలనుకునే అభిమానికి.. ఆయనే స్వయంగా ఓ లేఖను రాస్తే.. అది లేఖ కాదు.. సంజీవని అవుతుంది. ఆ విషయం ఇప్పుడు చిరు వీరాభిమాని విషయంలో నిజమైంది కూడా. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి అభిమాని దొండపాటి చక్రధర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని తెలుసుకున్న చిరంజీవి.. వెంటనే అతన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కి రప్పించారు. అతనికి మెరుగైన వైద్యం అందేలా.. అన్ని ఏర్పాట్లను చేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ‘నేను ఎప్పుడూ మీకు అండగా ఉంటాను’ అంటూ ఆయన పంపిన లేఖ.. ఆ అభిమాని అంతులేని సంతోషానికి కారణమైంది.
‘‘డియర్ డి. చక్రధర్ రావు
మీకు శుభాకాంక్షలు,
మీరు నా పేరు మీద పేద ప్రజలకు చేసిన సేవలు వర్ణనాతీతం. అవి అన్నీ చూసి నేను చాలా ఆనందపడ్డాను. మీరు అనారోగ్యంగా ఉన్నారని తెలిసి నేను చాలా బాధపడ్డాను. త్వరలోనే మీరు కోలుకొని ఎప్పటిలా ప్రజా సేవలో నిమగ్నమవుతారని ఆశిస్తున్నాను. నేను మీకు ఎప్పుడూ అండగా ఉంటాను. ప్రస్తుతానికి మీకు సర్జరీ కొరకు మరియు మెరుగైన వైద్యం కోసం రూ. 5 లక్షలు చెక్ పంపిస్తున్నాను. మరొకసారి మీకు నా అభినందనలు. ఎన్నో కార్యక్రమాలు నా పేరు మీద చేసి అందరికీ ఆదర్శంగా ఉన్నారు. త్వరలో పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబ సభ్యులకు నా నమస్కారములు తెలుపగలరు.
మీ,
చిరంజీవి’’ అంటూ చిరు పంపిన లేఖ.. ఆ అభిమానిలో ధైర్యాన్ని నింపడమే కాకుండా.. ఇదీ, చిరంజీవి అంటే అని మరోసారి అందరికీ తెలిసేలా చేసింది. అలా అందరి గురించి ఆలోచిస్తాడు కాబట్టే.. ఆయన చిరంజీవి.