పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఇప్పుడీ పేరొక సునామీ. ఒక అర ఎకరం పొలంలో వరి పండించుకుని సాధారణ రైతుగా బతకాలనుకున్న ఆలోచనలతో ఉన్న కల్యాణ్ అనే కుర్రోడు.. ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా.. నేడు ఓ సామ్రాజ్యాన్ని కంటిచూపుతో శాసించగల జనసేనాని అయ్యాడు. ఆయన విలక్షణ వ్యక్తిత్వం.. గొప్ప నాయకుడిని చేసి.. అభిమానమనే గుండెల్లోకి చేర్చింది. ఫ్లాప్స్ వస్తే ఏంటి.. పవన్ కల్యాణ్ అనే పేరు చాలు అనేలా.. ఫ్లాప్ ఫ్లాప్‌కి క్రేజ్ పెరిగిందే తప్ప.. తగ్గలేదు. ఇప్పటికీ పవన్ కల్యాణ్ ఫ్లాప్ సినిమా అంత కలెక్ట్ చేయలేదు.. అంటూ ఎందరో స్టార్ల సినిమాల విషయంలో వినబడుతూనే ఉంటుంది. అది పవన్ కల్యాణ్ పవర్. అందుకే ఆయన పవర్ స్టార్ అయ్యారు. వ్యక్తిత్వంలో ఆయనని మించినవారు లేరు. కోరుకుంటే కోట్లు వస్తాయి.. కానీ వాటిని వదులుకుని జనసేనానిగా జనంలో తిరుగుతున్నారు.. జనాల బాధలను తెలుసుకుంటున్నారు. మనుషుల కోసం, రాష్ట్రం కోసం.. దేశం కోసం ఏదో చేయాలనే తపన ఆయనలో రోజురోజుకీ పెరుగుతుందే తప్ప.. ఇసుమంత కూడా తగ్గడం లేదు. కష్టపడేవారిని చూస్తే కరిగిపోయే గుండె అది. ఆ కష్టం దూరం చేసేందుకు కోట్లు కూడా ఇవ్వగలడు.. కోట్లాటకైనా దిగగలడు.
మనిషై పుట్టిన తర్వాత కూతంత కళాపోషణ ఉండాలనేది అప్పటి మాట.. పవన్ కల్యాణ్ అభిమానై ఉండాలనేది ఇప్పటి మాట. అందుకే ఈ మధ్య కుర్రహీరోలంతా తమ సినిమా విడుదలయ్యే సమయంలో పవన్ నామస్మరణ చేస్తున్నారు. ఆయన పేరు పలకకుండా, ఆయనంటే ఇష్టం అని చెప్పకుండా.. ఇప్పుడున్న కుర్రహీరోల సినిమాలు విడుదల కావు. ఎందుకంటే, ఆ పేరుకున్న వైబ్రేషన్ అటువంటిది. ఆయన అభిమానులు బ్యాన్ చేయడం స్టార్ట్ చేస్తే.. బ్లడ్, బ్రీడ్ రెండూ పడుకుంటాయి. కింగైనా ఖంగుతినాల్సిందే.. విక్టరీకి కాలం చెల్లినట్టే.. సూపర్ టూర్స్ వేసుకోవడమే.. టైగర్ తోక ముడవాల్సిందే. ఆయన గొప్ప డ్యాన్సర్ కాదు.. అలాగనీ గొప్ప నటుడూ కాదు. ఆ విషయం ఎటువంటి బెదురు లేకుండా చెప్పగల నిరాడంబరత ఆయన సొంతం. మంచితనం, మానవత్వం, దేశభక్తి.. వీటికి మించిన హీరోయిజం లేదనేలా.. హీరోయిజం అర్థాన్నే మార్చేసిన హీరో అతను. ఆయనతో సినిమా చేయాలని కలలు కనని నిర్మాతలు.. ఆయనతో సెల్ఫీ దిగాలని కోరుకోని అభిమానులు లేరంటే.. ఆయన రేంజ్ ఏంటో.. ఆయన స్థాయేంటో అర్థం చేసుకోవచ్చు. నెంబర్స్‌తో కొలవలేనిది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థానం. నెంబరే కావాలంటే.. వన్‌కి మించిన ఏదైనా కొత్త అంకెను కనిపెట్టాలంతే. అందరి హీరోలకి అభిమానులుంటారేమో.. ఆయనకి భక్తులుంటారని హరీష్ శంకర్ చెప్పాడు కదా. ఈశ్వరా.. పవనేశ్వరా అని బండ్ల గణేష్ కొలిచాడు కదా. ఇంకేం కావాలి నిదర్శనం.. నీ దర్శనమైతే చాలనుకుంటోంది ఆయన అభిమాన గణం.
ఆయన అడుగు వేస్తే ఒక సైన్యమే వెనుక నడుస్తుంది. పోటీలో ఓడిపోయి ఉండవచ్చు.. ఆ ఓటమినే గెలుపుకు నాందిగా మలుచుకోవడం ఆయనకు పెద్ద కష్టమేమీ కాదు. ప్రస్తుతం ఆయన చేస్తుంది కూడా అదే. అవినీతి రహిత సమాజం కోసం నడిచే దారిలో.. ముందుగా తట్టుకుంటాడా? నిలబడతాడా? అనేది చూడడానికి ఓటమి ఎదురైంది. తట్టుకున్నాడు.. నిలబడ్డాడు.. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాజ్యోతిగా అవతరించాడు. ఇంకా గెలుపంటారా?.. ఆయన ఓడిపోయిన రోజే గెలిచాడు. కాదని ఎవరైనా అంటారా? అంటే ఎదురెదురుగా.. ఎటువంటి పైరవీలు చేయకుండా పోటీ చేసి నెగ్గమనండి. డిపాజిట్లు కూడా రావు.. ఆ విషయం తెలుసు కాబట్టే.. ఓడించడానికి సర్వ శక్తులను ధారపోశారు. అయినా ఏం లాభం? ఆయన ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ఒక్క నాయకుడూ లేడక్కడ. మైక్‌ల ముందు అరిసేవారే కానీ.. ప్రజల ప్రాబ్లమ్స్ చెప్పినా.. పట్టించుకునేదెవరక్కడ. వాళ్లు పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా.. నేనున్నానంటూ ఆపన్నుడికి హస్తం అందించిన అసలు సిసలైన లీడర్ పవన్ కల్యాణ్. ఆయన చేస్తున్న యజ్ఞం.. తరువాత తరం మంచి నడవడిక కోసం నిర్మించే వారధి. అదెంత స్ట్రాంగ్‌గా ఉండబోతుందో.. త్వరలోనే అందరికీ అర్థమవుతుంది.
‘‘ప్రజల బాధలు వినటంలో భూదేవికి ఉన్న ఓర్పు.. పరిష్కారం చేసేందుకు సముద్రమంత లోతైన ఆలోచన.. దానం చేయటంలో ఆకాశమంత ఎత్తయిన మనసు.. అన్యాయాన్ని ఎదిరించడంలో అగ్నిపర్వతం.. అవినీతిని ఊడ్చేయడంలో పెనుగాలి... ఇవన్నీ కలిసిన పంచభూతాలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్’’.. ఆ కర్మయోగి కలలు సాకారం కావాలని కోరుకుంటూ.. ‘హ్యాపీ బర్త్‌డే జనసేనాని, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్’.