పతాక శీర్షిక చూసి రాజమౌళి సపోర్టుతో, సూపర్ విజన్ తో బ్రహ్మాస్త్రం అద్భుతంగా వచ్చేసి ఉందనుకుంటే మీరు లైగర్ థియేటర్ లో లెగ్గెట్టేసినట్టే.!
బాహుబలితో దిక్కులు పిక్కటిల్లేలా.. ప్రపంచమంతా ప్రకంపనలు పుట్టేలా చేసిన దర్శక ధీశాలి రాజమౌళి సాటి దర్శకులలోనూ విపరీతమైన వేడిని పుట్టించాడు.. స్ఫూర్తిని రగిలించాడు.
అందుకే అందరూ ఆ అందలాన్ని అందుకోవాలని కదిలారు.. ఆ కాంక్షతోనే భారీ బడ్జెట్ కు వెనుకాడకుండా సాహసాలు చేసారు. అయితే సంజయ్ లీల భన్సాలీ బాజీరావ్ మస్తానీ నుంచీ.. మన చిరు చేసిన సైరా, మలయాళ మోహన్ లాల్ మరక్కర్, కన్నడ సుదీప్ రోనా, హిందీలో అక్షయ్ పృధ్విరాజ్ అన్నీ బెడిసికొడుతూనే వస్తున్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి కూడా.!
ఇపుడు అదే కోవలోకి చేరబోతోందా అనే ఫీలింగ్ నే కాదు... ఆ కాన్ఫిడెన్సుని కూడా కలిగించేలా దిగింది బ్రహ్మాస్త్రం ట్రైలర్. మరిక అదెలా ఉందనే వివరాల్లోకి వెళితే....
అమితాబ్ మరోసారి సైరా తరహా పాత్రకే పరిమితమని తెలుస్తోంది.
నాగార్జున ఆల్ రెడీ తాను చేసేసిన ఢమరుకాన్ని తలుచుకుని, నవ్వుని అణుచుకుని నటించారేమో అనిపిస్తోంది.
రణ్ బీర్ వంటి పెర్ ఫార్మర్ ట్రైలర్ షాట్స్ లోనే క్లూ లెస్ గా కనిపిస్తున్నాడంటే అది ఆడియన్సుకి మంచి క్లూ అనే తెలుస్తోంది.
అలియా బట్ బహుశా అది సినిమా షూట్ అని పెద్ద సీరియస్ గా ఏం తీసుకోకుండా యాడ్ షూట్ లా చేసేసినట్టుంది.
ఇక స్టోరీ కాన్సెప్ట్ అయితే చందమామ కథలు చదివిన పిల్లలు కూడా.. చల్, సబ్ కుచ్ మాలూమ్ హై మేరేకు అనేలా తగలడింది. తగలడింది అంటే తప్పుడు అర్ధం తీసుకోకండి. అగ్నితో హీరో పాత్రకు ఉండే బంధమది. బాలీవుడ్ వారి మేధస్సది.!
ఇప్పుడిక విజువల్ ఎఫెక్ట్స్ విషయానికి వద్దాం. నిజానికి ఇవే హైలైట్.!
ట్రైలర్ లో ఫస్ట్ ఫ్రేమ్ నుంచీ లాస్ట్ ఫ్రేమ్ వరకూ ఏదేదో చూపిద్దామని ట్రై చేసేసిన దర్శకుడు వీడియో గేమ్స్ కంటే తనది వీక్ విజవలైజేషన్ అని ప్రూవ్ చేసేసుకున్నాడు. స్మాల్ స్క్రీన్ పై ట్రైలర్ షాట్స్ కే నవ్వు వచ్చేస్తోందంటే ఇక రేపు ఈవీవీ సినిమానే బిగ్ స్క్రీన్ మీద.!
మొబైల్ యాప్స్ లోని వింత వింత ఆటలనే తాట తీసి అంతు చూస్తోన్న ఈ జనరేషన్ కిడ్స్ కి కామెడీగా అనిపించే గ్రాఫిక్స్ చూపిస్తే కిండల్ చేసి పండబెడతారనే హితవు ఎవరో ఒకరు చెప్పి ఉండాల్సింది నిష్ణాతులైన హిందీ సినిమావారికి.!
చిరంజీవి వంటి సీనియర్ హీరో వాయిస్ నేరేషన్ శుద్ధ దండగ అనిపించుకున్న గుంటూరోడు, సన్ అఫ్ ఇండియా వంటి సినిమాల సంకేతాలని ట్రైలర్ లోనే స్పష్టంగా చూపించేసిన బ్రహ్మాస్త్రం ఖచ్చితంగా బాక్సాఫీస్ కి ఓ బ్రహ్మ పదార్ధం. త్వరలోనే తెలిసిపోతుంది ఆ యధార్ధం.!
ఇపుడొద్దాం.. పతాక శీర్షిక విషయానికి...
కొంతమంది.. కాదు కాదు చాలామంది.. కానే కాదు ఇప్పుడున్న ఫిలిం మేకర్స్ అందరూ కూడా రాజమౌళి సాధిస్తోన్న సాటిలేని విజయాలకు కారణం తనకు సపోర్ట్ చేస్తోన్న విజువల్ ఎఫెక్ట్స్ అనో.. తన ఇమాజినేషన్ అనో.. లేక తాను తలకెత్తుకుంటోన్న భారీ బ్యాక్ డ్రాప్స్ అనో అనుకుంటున్నారు. వాస్తవానికి ఆయన నమ్ముతోంది బలమైన కథని. తెర పైకి తెస్తోంది చూస్తోన్న ప్రతి ఒక్కరినీ కదిలించగల భావోద్వేగాలని.!
ఆ అంశాన్నే అర్ధం చేసుకోలేకపోతోన్న ఇతర ఫిలిం మేకర్స్ కి అది తలకెక్కేదెప్పుడో..
ఏ ఒక్కరైనా.. లక్కీగా అయినా.. జక్కన్న పక్కకు చేరగలిగేది ఎన్నటికో.!
నీ సినిమా విజువల్స్ చూస్తున్నపుడే కాదు జక్కన్నా.. తలుచుకున్నపుడు కూడా వావ్ అనిపిస్తాయి.
ఇదిగో ఇలా పోల్చి చూసినపుడు ఇంకా ఇంకా చాలా గ్రేట్ అనిపిస్తాయి.
మేమంతా గర్వించే స్థాయిలో సాటి లేని రీతిలో సాగుతున్నందుకు సాహో దర్శక ధీరా..!
మాపై ఎపుడూ ఏడ్చే మీకు బ్రహ్మాస్త్రం మిగిల్చేది భస్మమేనేమో చూసుకోండి బాలీవుడ్ వీరా..!!