ఈ ఆగస్టు నెలలో టాలీవుడ్ హిట్ సినిమాలతో రెపరెపలాడింది. బింబిసార, సీత రామం, కార్తికేయ 2 సినిమాలు హిట్ అవడంతో అటు బాక్సాఫీసు గలగలలు, ఇటు ప్రేక్షకుల కిలకిలలు వినిపించాయి. టాలీవుడ్ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కడంతో ఆయా మేకర్స్ మాత్రమే కాదు, సినీ ప్రముఖులు కూడా ఊపిరి తీసుకున్నారు. దుల్కర్ సీత రామం, కళ్యాణ్ రామ్ బింబిసార ఒకే రోజు విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆ రెండు సినిమాలను ప్రముఖులు సర్వత్రా ప్రశంసించారు. ఇక ఒక్కొక్కరుగా సినిమాలు చూస్తూ ఆ సినిమాలని పొగుడుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు.
అందులో మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గానే సీత రామం మూవీ ని వీక్షించి.. ఆ సినిమాని ప్రశంసిస్తూ ట్వీట్ చేసారు. సీత రామం చూసాను. చక్కటి ప్రేమ కావ్యం చూసిన అనుభూతి కలిగింది. ముఖ్యంగా విభిన్నమైన స్క్రీన్ ప్లే తో ఈ ప్రేమకథని ఆవిష్కరించిన తీరు ఎంతగానో నచ్చింది. మనసులపై చెరగని ముద్ర వేసే ఇలాంటి చిత్రాన్ని ఎంతో ఉన్నతమైన నిర్మాణ విలువలతో తెరకెక్కించిన అశ్విని దత్, ప్రియాంక, స్వప్న దత్ లు, ఎంతో ఫ్యాషన్ తో చిత్రీకరించిన దర్శకుడు హను రాఘవపూడి, కలకాలం నిలిచే సంగీతాన్ని అందించిన విశాల్ చంద్ర శేఖర్ కి, అన్నిటికన్నా ముఖ్యంగా పాత్రలకి ప్రాణం పోసిన మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, కీలక పాత్ర పోషించిన రష్మిక కి నా శుభాకాంక్షలు. ప్రేక్షకుల మనసు దోచిన ఈ చిత్రం ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకోవాలంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ చిరు సీత రామం పై ట్వీట్ చేసారు.
ఇక రామ్ చరణ్ రెండు వారాల క్రితం విడుదలైన నిఖిల్ కార్తికేయ 2 సినిమా చూసి టీం ని ప్రత్యేకంగా అభినందించాడు. Good films always bring back glory to theatres! Congratulations to the entire team on the massive success of #karthikeya2 అంటూ కార్తికేయ టీమ్ ని పేరు పేరునా చరణ్ కంగ్రాట్స్ చెప్పాడు.