మదర్ థెరిస్సాకు మారు పేరు మెగాస్టార్ చిరంజీవి. ఆయన చేసే సేవాకార్యక్రమాలతో ఎందరో ప్రజలు ఊరట పొందారు. కష్టమని ఇంటికి వచ్చిన వారికెప్పుడు సాయం చేసేందుకు తన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని పలు సందర్భాలలో చిరు ప్రకటించారు. అసలు ఈ సేవా కార్యక్రమాలవైపు రావడానికి, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పేరిట బ్లడ్, ఐ బ్యాంకులు పెట్టడానికి గల కారణాలను తాజాగా జరిగిన సిసిసి జెర్సీ అండ్ ట్రోఫీ లాంచ్ కార్యక్రమంలో చిరు రివీల్ చేశారు. ముందు అటువంటి ఆలోచన లేదన్న చిరంజీవి.. ఎలా తను సేవా కార్యక్రమాలవైపు నడిచారో.. ఈ వేడుకలో వెల్లడించారు.
‘‘అందరిలాగానే మొదట్లో నాకు కూడా నా ఫ్యామిలీ గురించి మాత్రమే ఆలోచన ఉండేది. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి, పెద్ద పెద్ద కార్లు, బంగళాలు కొనాలని ఆశగా ఉండేది. దానికోసం నా వంతుగా కష్టపడ్డాను. ఆ తర్వాత నాకు డబ్బులు, పేరు వచ్చాయి. కొనాలనుకున్న వన్నీ కొన్నప్పటికీ తృప్తిగా అనిపించలేదు. అప్పుడు అనిపించింది తృప్తికి అంతం లేదని. ఎక్కడైతే తృప్తి లేదో అక్కడ మానసిక శాంతి కూడా లభించిదని తెలిసివచ్చింది. నా ఉన్నతికి కారణమైన వారికి ఏదో ఒకటి తిరిగిస్తేనే.. అది వస్తుందని భావించి.. ఏం చేస్తే బావుంటుందా? అని ఆలోచన మొదలెట్టాను. అలా నా మనసు సేవా మార్గం వైపు మళ్లింది. నాతో పాటు అభిమానులను కూడా సేవా మార్గం వైపు నడిపిస్తే.. అది కదా అసలు తృప్తి, ఆనందం అనే ఆలోచన వచ్చింది. అప్పుడు వచ్చిన ఆలోచనే బ్లడ్ బ్యాంక్. ఈ బ్లడ్ బ్యాంక్ విజయవంతంగా ముందుకు వెళుతోందంటే గొప్పమనసు ఉన్నవాళ్ల సహకారంతో పాటు అభిమానుల అండదండలు.. వారు కూడా ఈ ఉద్యమంలో మేము సైతం అంటూ భాగస్వాములు కావడం వల్లే.. ఈరోజు విజయవంతంగా వెళుతున్నాం. నిజంగా ఆ తృప్తి వర్ణించలేనిది. ఈ యజ్ఞంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు..’’ అని బ్లడ్ బ్లాంక్ స్థాపనకు గల కారణాలను మెగాస్టార్ ఈ వేదికపై పంచుకున్నారు.