గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన రెండు చిత్రాలు ఘన విజయం దిశగా దూసుకుపోతున్నాయి. ‘బింబిసార’ మాస్, ‘సీతారామం’ క్లాస్ అన్నట్లుగా.. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఇప్పటికే బ్రేకీవెన్ సాధించి.. లాభాల బాటలో నడుస్తున్న ఈ చిత్రాలు టాలీవుడ్‌కి సంతోషాన్నిచ్చాయి. ఈ మధ్య కాలంలో ‘మేజర్’ మినహా టాలీవుడ్‌లో సరిగా బొమ్మ ఆడలేదు. విడుదల విషయానికి వస్తే.. వారానికి రెండు, మూడు సినిమాలు విడుదలవుతున్నా.. థియేటర్లకి ప్రేక్షకులు రాక ఈగలు తోలుకునే పరిస్థితి. అలాంటి సమయంలో.. థియేటర్లు కళకళలాడేలా చేసిన చిత్రాలు ‘సీతా రామం’, ‘బింబిసార’. వీటి ప్రభంజనం ఇలా ఉండగానే.. ఇప్పుడు కొత్తగా అంటే ఈ వారం మూడు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. అందులో ఒకటి ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’. ఈ రోజే ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. రేపు (శుక్రవారం) నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదలవుతుండగా.. శనివారం నిఖిల్ నటించిన ‘కార్తికేయ 2’ చిత్రాలు విడుదలకు లైన్‌లో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: సినీజోష్ రివ్యూ: బింబిసార
ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’పై కూడా పాజిటివ్ స్పందనే వినిపిస్తోంది. ఇక రేపు విడుదల కాబోయే ‘మాచర్ల నియోజకవర్గం’ గురించి అయితే ఇండస్ట్రీలో బాగా చర్చలు నడుస్తున్నాయి. అందుకు కారణం.. నితిన్ ఈ చిత్రంలో కలెక్టర్‌గా నటించడమే. కొన్ని రోజుల క్రితం రవితేజ కూడా ‘రామారావు ఆన్ డ్యూటీ’ అంటూ కలెక్టర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. దారుణంగా విఫలమయ్యాడు. కత్తిలాంటి కాన్సెప్ట్ ఉండి కూడా.. సీక్వెల్ మోజులో పడి రామారావు కన్ఫ్యూజ్ అయ్యాడు. తద్వారా ఇండస్ట్రీ పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లేశాడు. రామారావు సరిచేయలేని లెక్కల్ని.. ఇప్పుడు కలెక్టర్‌గా వస్తున్న నితిన్ ఏమైనా సరిచేస్తాడా? గత వారం వచ్చిన విక్టరీని కంటిన్యూ చేస్తాడా?. మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికలు జరపడంతో పాటు.. ఇండస్ట్రీలో షూటింగ్స్ ఆపేసుకుని కూర్చున్న వారిపై కూడా ఒత్తిడి తీసుకువస్తాడా? అనేలా చర్చలు నడుస్తున్నాయి. ఏ విషయం ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. చూద్దాం.. కలెక్టర్‌గా నితిన్ ఏ రేంజ్‌లో డ్యూటీ చేస్తాడో?