‘కంటెంట్ బావుంటే.. ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారు’ అని మరోసారి ప్రేక్షకులు నిరూపించారని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా విడుదలైన ‘సీతా రామం’, ‘బింబిసార’ చిత్రాలు విజయం సాధించడంతో.. ఇరు చిత్రాల టీమ్స్‌కి చిరు అభినందనలు తెలిపారు. ఈ సంవత్సరం విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’, ‘కెజియఫ్ 2’, ‘విక్రమ్’ వంటి సినిమాలు మినహా.. ఇతర ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. భారీ అంచనాలతో వచ్చిన ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ వంటి చిత్రాలు కూడా డిజప్పాయింట్ చేశాయి. ఒక దశలో నిజంగానే ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూడటం మానేశారా? అనే అనుమానాలు కూడా వచ్చాయి. అయితే ఆ అనుమానాలను పటాపంచల్ చేస్తూ.. ఈ శుక్రవారం విడుదలైన ‘సీతా రామం’, ‘బింబిసార’ చిత్రాలు ఘన విజయం సాధించడమే కాకుండా.. టాలీవుడ్‌లో కొత్త ఆశలను చిగురింపజేశాయి. ఇదే విషయాన్ని చిరంజీవి వెల్లడిస్తూ.. ప్రేక్షకులకు.. అలాగే ‘సీతా రామం’, ‘బింబిసార’ యూనిట్స్‌కి అభినందనలు తెలిపారు. ఈ సినిమాలు విజయం సాధించడం పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లుగా చిరు చెప్పుకొచ్చారు.
‘‘ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటనీ మరింత ఉత్సాహాన్నిస్తూ, కంటెంట్ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ.. నిన్న విడుదలైన చిత్రాలు రెండూ విజయం సాధించడం ఎంతో సంతోషకరం.
ఈ సందర్భంగా ‘సీతారామం’ మరియు ‘బింబిసార’ చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులందరికీ నా మన:పూర్వక శుభాకాంక్షలు.’’ అని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.