గత కొన్ని నెలలుగా టాలీవుడ్‌కి సరైన విజయం లభించక నిర్మాతలు అల్లాడిపోతున్నారు. విడుదలైన ప్రతి సినిమా.. మొదటి ఆట నుండే నెగిటివ్ టాక్‌ని సొంతం చేసుకోవడం.. ఫలితంగా కలెక్షన్లను రాబట్టలేక.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం జరుగుతుంది. అలాంటి చిత్రాలను భారీగా ఖర్చు పెట్టి తీసిన నిర్మాతలు నష్టాలపాలవుతున్నారు. దీంతో ఏం చేయాలా అని నిర్మాతలు కొన్ని రోజులుగా తలలు పట్టుకుంటున్నారు. స్వయంగా వారే షూటింగ్స్ ఆపేసుకుని.. ఏం చేస్తే బాగుంటుందా? అని చర్చలు మొదలెట్టారు. ఈ చర్చలు ఎంత వరకు వచ్చాయి అనేది పక్కన పెడితే, షూటింగ్స్ ఆపేయడానికి వెనుక చాలా కారణాలు ఉన్నట్లే తెలుస్తుంది. అవేంటనేది పక్కన పెడితే.. అసలు ప్రక్షాళన చేయాల్సిన అంశాన్ని వదిలేసి.. వేరే విషయాలపై నిర్మాతలు ఫోకస్ పెట్టినట్లుగా కొందరు సినీ విమర్శకులు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.
విషయంలేని సినిమాలు తీసి.. జనాలను చూడమంటే, ఎలా చూస్తారు? ఎలా థియేటర్లకి వస్తారు? అందులోనూ ఇప్పుడు ఓటీటీలో వచ్చే కంటెంట్‌కు అలవాటు పడిన ప్రేక్షకులకు.. మన దర్శకులు చేసే కాపీ మ్యాజిక్‌లు క్లియర్‌గా అర్థమైపోతున్నాయి. దర్శకనిర్మాతల ఫార్ములాలను వారు ఇట్టే పసిగట్టేస్తున్నారు. ఇంక చాలు, ఆపండి అని హింట్ ఇచ్చినా.. అదే రొట్ట, రొటీన్ సినిమాలతో వచ్చి.. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనే నెపం వేస్తున్నారు. కంటెంట్ ఉంటే, కచ్చితంగా థియేటర్లకు వస్తాం అని.. తాజాగా విడుదలైన ‘సీతా రామం’, ‘బింబిసార’ సినిమాల సాక్షిగా ప్రేక్షకులు నిరూపించారు. మరి ఈ సినిమాల రిజల్ట్‌తోనైనా మన దర్శకనిర్మాతలలో మార్పు వస్తుందేమో చూద్దాం.