నా రూటే సపరేటు అని మోహన్ బాబు ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ మాదిరిగానే.. ఆయన చేస్తున్న పనులు ఉంటాయి. సినిమాల విషయంలో బాగా డల్ అయిన మోహన్ బాబు తాజాగా కూతురు లక్ష్మిప్రసన్న తో కలిసి అగ్ని నక్షత్రం చేస్తున్నారు. సినిమాల విషయం పక్కనబెడితే.. మోహన్ బాబు రాజకీయాల్లో రకరకాలుగా హైలెట్ అవుతున్నారు. మొదట్లో సీనియర్ ఎన్టీఆర్ టిడిపి పార్టీ కి అండదండలు అందించిన మోహన్ బాబు తర్వాత చంద్రబాబు తోనూ చేతులు కలిపారు. చంద్రబాబు హెరిటేజ్ కంపెనీల్లోనూ వ్యాపార భాగస్వామిగా మారిన మోహన్ బాబు టిడిపి నుండి బయటికి వచ్చి కొన్నాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉన్నారు. తన విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు ఫీజు రీఎయింబర్స్ మెంట్ చెల్లించలేదని.. గత ఎన్నికలకు ముందు తిరుపతిలో మోహన్ బాబు ఆందోళన నిర్వహించారు.
ఆ తర్వాత వైసీపీ లో జగన్ ముఖ్యమంత్రి అవ్వక ముందు నుండి జగన్ కి చేరువలో ఉంటూనే మధ్యలో బిజెపి పార్టీ, పీఎం మోడీ తో మీటింగ్ పెట్టారు. ఇంకేంటి మంచు ఫ్యామిలీ బిజెపి లోకి వెళ్లబోతుంది అంటూ ప్రచారం జరిగింది. ఈమధ్యలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ని అనరాని మాటలతో తిట్టి పోశారు. కొంతకాలంగా వైసీపీ తోనూ డిస్టెన్స్ మెయింటింగ్ చేస్తున్నారు. ఇలాంటి టైం లో మోహన్ బాబు తన కూతురు లక్ష్మి తో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు ని మీట్ అవడం హాట్ టాపిక్ గా మారింది. చాలా రోజులుగా దూరంగా ఉంటున్న మోహన్ బాబు, చంద్రబాబుతో సడన్ గా భేటీ అయ్యి సుదీర్ఘ చర్చలు జరపడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కానీ చంద్రబాబుని మోహన్ బాబు కలిసింది మాత్రం తిరుపతిలోని విద్యానికేతన్ దగ్గరలో నిర్మించిన సాయి బాబా గుడి ఓపెనింగ్ కి చంద్రబాబు ని ఆహ్వానించడానికి. సాయి బాబా గుడి కోసం టీడీపీ హయాంలోనే స్థలం కేటాయించడంతో ఇలా మోహన్ బాబు కూతురితో కలిసి చంద్రబాబు ని ఆహ్వానించడానికి వెళ్లినప్పటికీ.. రాజకీయాలు గురించి కూడా చర్చించినట్లుగా సమాచారం. అయితే మోహన్ బాబు ఇలా చంద్రబాబు ని కలవడం చూసిన నెటిజెన్స్.. ఏదైనా మోహన్ బాబు రూటే సపరేటు అంటూ కామెంట్ చేస్తున్నారు.