ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ ఎటువంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాలోని బన్నీ మేనరిజమ్స్ వైరల్ అయ్యాయి. దీంతో ‘పుష్ప 2’ సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి. ఇంకా సెట్స్‌పైకి వెళ్లని ఈ సినిమాకి సంబంధించి వినిపిస్తున్న వార్తలు భారీగా ‘పుష్ప 2’పై క్రేజ్‌ని పెంచుతున్నాయి. బడ్జెట్, బిజినెస్ ఇలా.. అన్నింటి విషయంలో.. టాలీవుడ్ స్థాయిని మరోసారి పెంచే చిత్రంగా ఈ చిత్రం ఉండబోతుందనేలా ప్రస్తుతం టాక్ నడుస్తుంది. అయితే అంచనాలే కాదు.. ఈ సినిమాపై అదే స్థాయిలో అనుమానాలు కూడా వ్యక్తమవుతుండటం విశేషం. తాజాగా బన్నీ తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో షేర్ చేసిన పిక్‌తో ఈ అనుమానాలు తారా స్థాయికి చేరాయి.
అల్లు అర్జున్ తన ఇన్‌స్టా అకౌంట్‌లో ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటోని షేర్ చేశాడు. ఈ ఫొటోలో అతని మేకోవర్ చూసిన వారంతా.. ‘పుష్ప 2’ ప్రాజెక్ట్‌పై రకరకాలుగా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లాల్సిన ఈ చిత్రం.. అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఆగస్ట్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అల్లు అర్జున్ పోస్ట్ చేసిన ఈ పిక్‌ని చూసిన వారంతా.. రాబోయే పార్ట్ 2లో బన్నీ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడా? అనేలా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, మొన్నటి వరకు లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో మాస్ లుక్‌లో దర్శనమిచ్చిన బన్నీ.., తాజా ఫొటోలో ట్రిమ్ చేసిన గడ్డం, హెవీ హెయిర్‌తో స్టైలిష్ డాన్‌లా కనిపిస్తున్నారు. ఈ లుక్ నిజంగా ‘పుష్ప 2’ కోసమే అయితే.. పార్ట్ 1కి, పార్ట్ 2కి అసలు సంబంధమే ఉండదు.. అనేలా అప్పుడే ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. మరోవైపు ఈ లుక్ బన్నీ ఓ యాడ్ కోసం చేసింది.. అనేలా కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ అనుమానాలు వీడాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.