కరోనా టైం లో థియేటర్స్ క్లోజ్ అవడంతో ఓటిటీలు చెలరేగిపోయాయి. ఓటిటీల దెబ్బకి ప్రేక్షకుడి మైండ్ సెట్ థియేటర్స్ నుండి ఓటిటి వైపు టర్న్ అయ్యింది. చివరికి నిర్మాతలు ఓటిటీలకి తాళాలు ఇచ్చెయ్యడంతో థియేటర్స్ వ్యవస్థకి ముప్పు వాటిల్లింది. గతంలో ఏదైనా సినిమాకి కాస్త నెగెటివ్ టాక్ వచ్చినా అమ్మిన దానిలో సగం కలెక్షన్స్ అయినా వచ్చేవి. కానీ ఇప్పుడు ప్లాప్ సినిమాని థియేటర్స్ లో చూడాలా.. అనే స్టేజ్ కి జనాలు వచ్చేసారు. అంతేకాకుండా టికెర్ రేట్స్ పెంచెయ్యడం ప్రేక్షకుడికి తలకి మించిన భారం అయ్యింది. హిట్ సినిమాకి కూడా థియేటర్స్ కి వెళ్లి చూడడం మానేశారు ఫ్యామిలీ ఆడియన్స్. 15 రోజులకో, నెలకో ఓటిటికి వచ్చేస్తుంది అనే ధీమా. నిర్మాతలు కూడా మీడియం బడ్జెట్, లో బడ్జెట్ సినిమాలను థియేటర్స్ బిజినెస్ తో పోటీగా ఓటిటీలకి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
అటు నిర్మాతలు, ఇటు ఓటిటీలు కలిసి థియేటర్స్ వ్యవస్థని చీకట్లోకి నెట్టెయ్యడంతో.. ఇప్పుడు నిర్మాతలికి తెలివి వచ్చింది. దానితో ఓటిటీలకు కళ్లెం వేసే డీల్ సెట్ చేసారు. కాకపోతే లో బడ్జెట్, మీడియం బడ్జెట్, బిగ్ బడ్జెట్ మూవీస్ కి ఒకేలా ఒటిటి డీల్ లేకుండా.. ఒక్కో రకమయిన నిబంధనలు పెట్టుకున్నారు. 6 కోట్ల లోపు బడ్జెట్ సినిమాలను లో బడ్జెట్ సినిమాలుగా పరిగణించి, ఈ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన 4 వారాల తర్వాతే ఓటీటీలో విడుదలకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 6 కోట్లకు పైబడి బడ్జెట్‌తో రూపొందే సినిమాలను భారీ బడ్జెట్ సినిమాలుగా పరిగణించి, ఆ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాక కనీసం 10 వారాల పాటు ఓటీటీలో విడుదలకు అనుమతి ఇవ్వకూడదని ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది.