మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య యుద్ధం ముదురుతోంది. మొన్నటి వరకు చిరంజీవి, బాలకృష్ణల విషయంలో పోట్లాడుకునే ఫ్యాన్స్.. ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ విషయంలో సోషల్ మీడియా వేదికగా గొడవలు పడుతూ.. బూతులు తిట్టుకుంటున్నారు. రీసెంట్‌గా చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ చేసిన పాత్రలపై ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుంది. చరణ్‌కి మంచి పాత్ర ఇచ్చారని, ఎన్టీఆర్‌ని తక్కువ చేశారని.. ఇలా మొన్నటి వరకు జరిగిన రచ్చ.. ఇప్పుడు హాలీవుడ్ అవకాశం అంటూ వీరిద్దరూ విషయంలో ఫ్యాన్స్ వార్‌కి దారి తీస్తుంది. వాస్తవానికి ఈ సినిమాలో కలిసి చేయడానికి ఎన్టీఆర్, చరణ్ అన్నదమ్ములలాగా చేశామని చెప్పుకొచ్చారు. అలాగే వాళ్లు రియల్ లైఫ్‌లో కూడా ఎలా ఉంటారో.. పలు వేదికలపై వెల్లడించారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్‌లో కూడా వారి మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో, పుట్టినరోజు వస్తే ఏం చేస్తారో.. వంటి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఈ ప్రమోషన్స్ తర్వాత.. ఇక మెగా, నందమూరి అభిమానుల మధ్య గొడవలు తగ్గుతాయనే అంతా అనుకున్నారు. కానీ.. సినిమా విడుదల తర్వాత.. వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.
సినిమాని సినిమాలాగా చూడటం ప్రేక్షకులు ఎప్పుడో మానేశారు. అంతా క్రిటిక్స్ వ్యూలోనే చూస్తున్నారు. అందులో అభిమానులు అనేవాళ్ల శాతం మరింత ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఏ పాత్ర ఎవరికి ఇవ్వాలో దర్శకుడు రాజమౌళికి తెలియదా? పాత్ర చెప్పిన తర్వాతే కదా.. ఎన్టీఆర్, చరణ్‌లు చేసింది. వారికి తెలియదా.. ఏ పాత్ర ఎక్కువో.. ఏ పాత్ర తక్కువో. అయినా అభిమానులు అనే వాళ్లు.. తమ హీరో అభిప్రాయాన్ని గౌరవించకపోతే.. వారసలు అభిమానులేనా? ఎందుకు ఆలోచించలేకపోతున్నారు. పోనీ ఎన్టీఆర్‌కి తక్కువ పాత్ర అనుకుందాం.. చరణ్‌కి ఏమైనా ఇంటర్ నేషనల్ అవార్డ్స్ వచ్చాయా? అసలు చరణ్‌ని ఆ పాత్రకి ఒప్పించిందే ఎన్టీఆర్.. ఈ విషయం స్వయంగా ఎన్టీఆరే ఓ సందర్భంలో చెప్పారు. దీన్నేందుకు మెగా ఫ్యాన్స్ పట్టించుకోవడం లేదు. ఇక ఇప్పుడు హాలీవుడ్ క్రేజ్ గురించి రచ్చ చేస్తున్నారు. హాలీవుడ్‌కి చెందిన కొందరు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. ట్వీట్స్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో కూడా బూతులు తిట్టుకుంటున్నారు మెగా,నందమూరి అభిమానులు. కానీ, ఒక తెలుగు సినిమాకి, తెలుగు హీరోలకి ఇంతటి స్థాయి గుర్తింపు వచ్చిందనేలా వారు ఎందుకు ఆలోచించడం లేదు. ఎన్టీఆర్, చరణ్‌ల మధ్య ఉన్న బాండింగ్ చూసి కూడా.. సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటున్నారంటే.. వారసలు అభిమానులేనా? అనే డౌట్ కూడా కొందరు వ్యక్తం చేస్తుండటం విశేషం.