టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకుంది. తను చేసిన ఓ ఆల్బమ్ ఇప్పుడు వివాదాలకు కారణమవుతోంది. సింగర్‌గా ఎన్నో పాటలు పాడి మెప్పించిన శ్రావణ భార్గవి.. తాజాగా అన్నమయ్య సంకీర్తన ‘ఒకపరి కొకపరి వయ్యారమై’ అనే కీర్తనకు సంబంధించిన వీడియోని తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసింది. ఈ కీర్తనలో ఆమె పాటని అపహాస్యం చేసింది. తన అందాలను అభివర్ణిస్తూ.. పడుకుని పాట పాడటమే కాకుండా.. దైవ కీర్తనని తన సొంత భావాలను వ్యక్త పరిచేలా చిత్రీకరించింది. అంతేకాదు, తన గ్లామర్ ఎక్స్‌పోజ్ చేస్తూ.. చీరలో కాళ్లు కనబడేలా పడుకుని ఆమె పాడిన ఈ కీర్తనపై ఇప్పుడు అన్నమయ్య వంశస్థులు సీరియస్ అవుతున్నారు. ఈ వీడియోపై అన్నమయ్య వంశస్తుడు హరినారాయణ చార్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీరియస్ అయ్యారు. వెంటనే ఆ వీడియోని డిలీట్ చేయకపోతే కోర్టుకు వెళతామని కూడా ఆయన హెచ్చరించారు.
అన్నమయ్య పెద్ద కుమారుడైన పెద తిరుమలాచార్యులు ఆ తిరుమలేశునికి అభిషేక కైంకర్యం చేస్తూ.. భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి అపహాస్యం చేసేలా చిత్రీకరించడం తప్పని ఆయన ఆగ్రహించారు. ఈ విషయంపై ఆమెను కాంటాక్ట్ చేయగా.. ఆ వీడియోలో ఏం తప్పు లేదని, చూసే మీ చూపులోనే తప్పు ఉందంటూ.. రివర్స్‌లో శ్రావణ భార్గవి సమాధానమివ్వడంతో.. ఆయన మరింతగా కోపోద్రిక్తులవుతున్నారు. ఈ విషయంలో శ్రావణ భార్గవి చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని హరినారాయణ చార్యులు తెలిపారు. ఈ విషయాన్ని టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతానని, అవసరం అయితే కోర్టుకు వెళ్లి అయినా.. ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తామని అన్నమయ్య వంశస్తుడు హరినారాయణ చార్యులు తెలిపారు.