తెలుగు సినిమా ఇండస్ట్రీకి మళ్లీ కష్టకాలం రాబోతోంది. ఇప్పటికే కరోనా రూపంలో భారీగా నష్టాన్ని ఫేస్ చేసిన టాలీవుడ్.. ఇప్పుడు వర్కర్స్ జీతాలు ఒకవైపు, సినిమాల నిర్మాణ వ్యయం అంటూ మరో వైపు జరుగుతున్న చర్చలతో.. మరోసారి షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యే అవకాశం కనబడుతోంది. రీసెంట్‌గా వర్కర్స్ జీతాల విషయమై.. రెండు రోజుల పాటు కార్మికులందరూ సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఆ రెండు రోజులు షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. దీంతో వెంటనే చర్చలకు దిగిన నిర్మాతల మండలి.. ఓ కమిటీని ఏర్పాటు చేసి ఫిల్మ్ ఫెడరేషన్‌తో విడతల వారీగా చర్చలు జరపాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ కమిటీకి దిల్ రాజు అధ్యక్షత వహించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో.. ఈ గొడవ సద్దుమణిగినట్లుగానే వాతావరణం కనబడింది. కానీ ఇప్పుడు నిర్మాతల సైడ్ నుండి కార్మికులకు ఝలక్ ఇచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ప్రస్తుతం వినబడుతోన్న వార్తలు చెప్పకనే చెబుతున్నాయి.
వర్కర్స్.. తమ జీతాల విషయంలో ఎంత గట్టిగా ఉన్నారో.. ఇప్పుడు నిర్మాతలు అంతకంటే గట్టిగా తమ పవర్ చూపించేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం. అదే జరిగితే దాదాపు 3 నెలల పాటు అసలు షూటింగ్సే జరిగే అవకాశం లేదు. ప్రస్తుతం సినిమాలకు పెరుగుతున్న నిర్మాణ వ్యయం కారణంగా నిర్మాతలు నష్టాల పాలవుతున్నారు. ఒకరిద్దరూ మినహా.. ఈ మధ్య కాలంలో సినిమాల కారణంగా లాభపడిన నిర్మాతంటూ ఎవరూ లేరు. డిజిటల్, శాటిలైట్ వంటి బిజినెస్ లేకపోతే.. నిర్మాతలెవరూ అసలు నిర్మాణం వైపు కూడా చూడరు. ఎందుకంటే, ఓటీటీల పుణ్యమే కానివ్వండి.. ఇంక ఇతరత్రా ఏదైనా కానివ్వండి.. ఇప్పుడు థియేటర్లకి ప్రేక్షకులు వచ్చే విధానంలో చాలా ఛేంజ్ వచ్చింది. బీభత్సమైన హిట్ అనే టాక్ వస్తే తప్ప.. థియేటర్లకి ప్రేక్షకులు రావడం లేదు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమాలను విడుదల చేసేందుకు భయపడుతున్నారు.
నష్టాలు వచ్చాయని నిర్మాతల ఇంటి చుట్టూ తిరుగుతున్న డిస్ట్రిబ్యూటర్లు.. అంటూ ఈ మధ్య కాలంలో వార్తలు బాగా వినిపిస్తున్నది తెలియంది కాదు. అందుకే.. నిర్మాణ వ్యయం తగ్గించి, భారీగా కాకపోయినా.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టాలు పాలు కాకుండా కలెక్షన్స్ రాబట్టేలా.. చర్యలు తీసుకోవాలని నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఫిల్మ్ చాంబర్, నిర్మాతల మండలి దీనిపై కార్యచరణ కూడా ప్రారంభించినట్లుగా టాక్ నడుస్తుంది. ఇందులో భాగంగానే ఆగస్ట్ నుండి షూటింగ్స్ కూడా ఆపేయాలనే నిర్ణయానికి వారు వచ్చినట్లుగా టాలీవుడ్ అంతా వార్తలు వైరల్ అవుతున్నాయి. అదే జరిగితే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మరోసారి కష్టకాలం సంభవించినట్లే. చూద్దాం.. ఏం జరగబోతోందో..!